Hyderabad: హైదరాబాద్ విశ్వనగరం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే.. హైదరాబాద్ ఈ స్థాయిలో విస్తరిస్తుందా? అని చాలామంది నొసలు చిట్లించారు. కానీ ఈ రోజున హైదరాబాద్ దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని అధిగమించేందుకు సిద్ధంగా ఉంది. ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, పెద్దపెద్ద కార్యాలయాలతో హైదరాబాద్ అత్యంత ధనిక నగరం గా కనిపిస్తోంది. హైదరాబాద్ అంటే ఒకప్పుడు పాత సిటీ మాత్రమే గుర్తుకువచ్చేది. ఇప్పుడు నానక్ రామ్ గూడ, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నెక్నాంపుర, పుప్పాల్ గూడ, నార్సింగి, కోకాపేట్, మంచిరేవుల, వంటి ప్రాంతాలు మరో అధునాతన నగరానికి కేంద్ర బిందువులయ్యాయి. దీంతో హైదరాబాద్ మరింత విస్తరించింది. అయితే మంచి వెనుక చెడు ఉన్నట్టు.. హైదరాబాద్ మహానగరంలో చెరువులు మొత్తం ఇప్పుడు మాయమైపోయాయి. వాటికి రికార్డులు పుట్టుకొస్తున్నాయి. దీని వెనుక ఎవరున్నారో తెలియదు కానీ.. చివరికి చెరువుల్లో ఉన్న బఫర్ జోన్లలో సైతం పెద్ద పెద్ద భవంతులు నిర్మాణం అవుతున్నాయి. చిన్న చిన్న కుంటలు అయితే గెట్ కమ్యూనిటీలుగా మారిపోతున్నాయి. వర్షాకాలం వస్తే ఈ ప్రాంతాలు మొత్తం నీట మునిగిపోతున్నాయి. కేవలం ఇది మాత్రమే కాదు, నాలాలు, ఇతర ప్రాంతాలు కూడా కబ్జాకు గురవుతున్నాయి..
దర్జాగా కబ్జాల పర్వం
గత ప్రభుత్వంలో కబ్జాల పర్వం దర్జాగా సాగిందని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఓ మంత్రి ఏకంగా ఒక్క చేరుకునే కబ్జా చేశాడని, అందులో ఆసుపత్రి నిర్మించడంతో వర్షం వల్ల నీరు వచ్చిందని వార్తలు వినిపించాయి. ఇలాంటి వారి వల్ల హైదరాబాద్ నగరంలో ఇల్లు లేదా ఇతర స్థలాలు కొనాలనుకునేవారు భయపడిపోతున్నారు. అది చెరువు శిఖం లేదా కబ్జా చేసిన భూమో అనే భయం వారిని ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆక్రమణల గుట్టు రట్టు చేసేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చింది. ఇటీవల దీనిని చట్టం చేశారు.. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దాని పరిధిలో ఉన్న 27 పుర పాలకాలు, నగర పాలకాలు, 33 గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోకి వస్తాయి. ఈ హైడ్రా కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ కొనసాగుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో రంగనాథ్ ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతున్నారు. రాజేంద్రనగర్ లో చెరువులో నిర్మించిన ఎంఐఎం ఎమ్మెల్యే ఇంటిని నేలమట్టం చేశారు. హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. కబ్జాలు లేని హైదరాబాద్ నగరాన్ని చూడాలి అనేది ఆయన కలగా ఉంది. అందువల్లే ఇటువంటి ఆక్రమణలను ఆయన సహించలేకపోతున్నారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచిస్తున్నారు. అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా స్వర్ణ యుగం తేవాలని భావిస్తున్నారు. ఇవన్నీ జరిగితే హైదరాబాద్ నగర పరిధిలోని ప్రజలకు నిశ్చింతగా ఉంటుంది. స్థలాలు కొనుగోలు చేసేందుకు, ఇళ్లను సమకూర్చుకునేందుకు వారిలో భరోసా ఏర్పడుతుంది. బిల్డర్లకు కూడా నిశ్చింతగా ఉంటుంది.
రంగనాథ్ కమిషనర్ గా వచ్చిన తర్వాత..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆక్రమించిన ప్రహరీని కూల్చేశారు. దీంతో దానం నాగేందర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఫలితంగా రంగనాథ్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను లోకల్ వ్యక్తినని, కమిషనర్లు వచ్చిపోతుంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సహజంగానే సోషల్ మీడియాలో చర్చకు దారి తీసాయి. మీడియాలోనూ ప్రముఖంగా వినిపించాయి. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దానం నాగేందర్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. కబ్జాలు లేని నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంగా పెట్టుకుంటే.. దానం నాగేందర్ లాంటివారు అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానం నాగేందర్ మాటలు ఎలా ఉన్నా.. హైదరాబాద్ నగరంలో ఇలానే కబ్జాలు పెరిగిపోతే భవిష్యత్తు అనేది అంధకారంగా మారిపోతుందని వారు అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతున్నప్పుడు ప్రజాప్రతినిధులు అడ్డు తగలకూడదని హితవు పలుకుతున్నారు. మరి ఇప్పటికైనా దానం నాగేందర్ మారతారా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Many areas in hyderabad are under occupation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com