Real Estate Business : ఏ రోటి కాడ ఆ పాట.. ఆ సామెతను ఇప్పుడు రాజకీయ నాయకులు నిజం చేసి చూపిస్తున్నారు. సోషల్ మీడియా బలంగా ఉన్నప్పటికీ.. మీడియా అత్యంత అప్డేట్ గా ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు నాలుక మడత పెడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్నచోట ఒక విధంగా.. అనుకూలంగా లేని చోట మరొక విధంగా మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం టిడిపి నుంచి మొదలైంది. టిడిపిలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత.. రాజకీయ ప్రయోజనాల కోసం భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని గెలిచారు. మంత్రి కూడా అయ్యారు.
తన మాట తీరు వల్ల ఆయన సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. స్థిరాస్తి వ్యాపారి, విద్యా వ్యాపారి కావడంతో సహజంగానే ఆయనకు మీడియాలో పాపులారిటీ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా మల్లారెడ్డి నిత్యం కనిపిస్తూ ఉంటారు. అందువల్ల ఆయన ఏం మాట్లాడినా సరే మీడియా విశేషమైన ప్రాచుర్యం కల్పిస్తుంది. సోషల్ మీడియా కూడా విపరీతమైన పబ్లిసిటీ కల్పిస్తుంది. అందువల్లే మల్లారెడ్డి తనకు తాను గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటారు. పాలమ్మి, పూలమ్మి, కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా అభివర్ణించుకుంటారు. ఏదైనా దర్యాప్తు సంస్థలు తన మీదికి వస్తే మాత్రం సెంటిమెంట్ కార్డు ముందు పెడతారు.
ఇటీవల మల్లారెడ్డి ఏపీలో పర్యటించారు. తిరుమల వెంకన్న స్వామి సేవలో తరించారు. ఆ సమయంలో అక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి గురించి గొప్పగా చెప్పారు. తెలంగాణలో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు బాటలు వేశారని చెప్పుకున్నారు. మల్లారెడ్డి నోటి నుంచి ఆ మాటలు రావడంతో గులాబీ శ్రేణులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన ఆయన ఒక్కసారిగా తన మాటను మార్చారు. రేవంత్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో రూపాయి కూడా పుడుతలేదని తన ఆవేదనని వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని.. ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని.. యువత గుండెలో కేటీఆర్ ఉన్నారని.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. అసలే మల్లారెడ్డి.. ఆపై రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. మల్లారెడ్డి కోరుకున్నది కూడా ఇదే కాబట్టి.. విపరీతమైన ప్రచారం లభిస్తోంది.
మల్లారెడ్డి అలా అన్నాడని కాదు కానీ.. తెలంగాణలో నిజంగానే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. కేసీఆర్ హయాంలో ఏ మూలన అయినా 30 నుంచి 40 లక్షలు ఉన్నా ఎకరం ఇప్పుడు 20 లక్షలు అన్నా ఎవరూ కొనడం లేదు. అసలు క్రయవిక్రయాలు పడిపోయాయి. దీంతో నిర్మాణ రంగం, దానికి అనుబంధ రంగాల్లో పైసా పుట్టని పరిస్థితి నెలకొంది. రేవంత్ సర్కార్ వచ్చాక చాలా రంగాలకు డబ్బుల కొరత వెంటాడుతోంది. మార్కెట్లోనూ డబ్బుల చెలామణీ బాగా తగ్గింది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తే మల్లారెడ్డి అన్నట్టుగా ‘తెలంగాణలో రూపాయి పుడతలేదు..’ అని మల్లారెడ్డి చెప్పింది నిజం..