Loksabha Election Results 2024:తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ‘మల్కాజ్ గిరి’ స్థానం కీలకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంతో పాటు ఒకప్పుడు ఆయన ఇక్కడ ఎంపీగా పనిచేశారు . అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి అన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి బరిలో ఉన్నారు. ఇలా ఇద్దరు ఉద్దండుల మధ్య సాగిన పోరులో ఇక్కడ గెలుపెవరిది? అన్న ఉత్కంఠ నెలకొంది.
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి 7 సార్లు ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ పార్టీ లో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తరువాత వెంటనే ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో ఈటల రాజేందర్ కు బీజేపీ అధిష్టానం కీలక పదవులు అందించింది. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి స్థానం నుంచి టికెట్ కేటాయించింది.
మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంపై తీవ్ర ఉత్కంట నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఇదే. దీంతో ఆయన హయాంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్న తపనతో ఉన్నారు. దీంతో సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. గతంలో రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ బలంతోనే మరోసారి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారన్న ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు.
మరోవైపు ఈటల రాజేందర్ సైతం ఇక్కడ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినట్లే తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీసైతం ఈ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఈటలకు ఉన్న అభిమానంతో పాటు మోదీ చరిష్మాతో ఇక్క డ బీజేపీ గెలుస్తుందని భావిస్తునన్నారు. అయితే మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండం గమనార్హం. దీంతో ఈ నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఈటల పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఓడిపోతే మాత్రం రాజకీయ భవితవ్యం ఏంటీ? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేటి ఫలితాలు ఈటల భవిష్యత్ ను నిర్ణయించనున్నట్లు చెప్పుకుంటున్నారు.