Lok Sabha Election Results 2024: కనీస పోటీ ఇవ్వని బీఆర్‌ఎస్‌..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో పట్టు నిలుపుకుని సత్తా చాటాలనుకుంది. ఈమేరకు కేసీఆర్‌ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు.

Written By: Raj Shekar, Updated On : June 4, 2024 12:14 pm

Lok Sabha Election Results 2024

Follow us on

Lok Sabha Election Results 2024: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే హోరాహోరీ పోరు సాగుతోంది. పదేళ్లు అధికారంలో ఉండి.. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఒక్క మెదక్‌లోనే కాస్తా పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మిగతా 16 స్థానాల్లో అభ్యర్థులు చేతులెత్తేశారు.

2 సీట్లపై ఆశలు..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో పట్టు నిలుపుకుని సత్తా చాటాలనుకుంది. ఈమేరకు కేసీఆర్‌ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. బస్సు యాత్ర చేశారు. కానీ, ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్‌ ప్రచార ప్రభావం పెద్దగా లేనట్లే కనిపిస్తోంది. అయినా కరీంనగర్, మెదక్‌ స్థానాల్లో గెలుస్తామని, నాగర్‌కర్నూల్‌లో పట్టు సాధిస్తామని భావించారు. కానీ, ఇప్పుడు ఒక్క మెదక్‌లోనే కాస్త పోటీ ఇస్తోంది. కేసీఆర్‌ సొంత జిల్లా, మాజీ మంత్రి హరీశ్‌రావుకు పట్టు ఉండడం, అన్నీ తానై వ్యవహరించడంతో వెంకట్రామిరెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు.

కౌంటింగ్‌ కేంద్రాలను వీడుతున్న నేతలు..
ఇక పోటీ ఇస్తామని భావించిన బీఆర్‌ఎస్‌ నేతలకు ప్రజలు ఓట్లు వేయకపోవడంతో చాలా చోట్ల డిపాజిట్‌ గల్లంతయ్యే పరిస్థితి ఉంది. దీంతో ఓటమి బాటలో ఉన్న నేతలు కౌంటింగ్‌ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్నారు. మహబూబ్‌బాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ స్పష్టమైన ఆధిక్యం మొదటి నుంచి కనబరుస్తున్నారు. దీంతో ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎంపీ మాలోతు కవిత కనీస పోటీ ఇవ్వలేదు. దీంతో కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇక ఖమ్మంలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురామ్‌రెడ్డి కూడా మొదటి రౌండ్‌ నుంచి లీడ్‌ ప్రదర్శిస్తున్నారు. దీంతో సిట్టింగ్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. దీంతో ఆయన కూడా కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఆదిలాబాద్‌లో కూడా ఆత్రం సక్కు కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపనోయారు. ఇక్కడ కూడా బీజేపీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. కరీంనగర్, నిజామాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.