https://oktelugu.com/

Lok Sabha Election 2024: ఖమ్మంలో మాటల మంటలు.. లోకల్, నాన్ లోకల్ ఫైట్.. ఎవరు గెలుస్తారు?

అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోవడంతో.. ఆ పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు కు ఈసారి అంత వేవ్ కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 10, 2024 / 11:36 AM IST

    Lok Sabha Election 2024

    Follow us on

    Lok Sabha Election 2024: తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉండగా.. అందులో ఖమ్మానిది ప్రత్యేకం. ఈ ప్రాంతం ఆంధ్రాకు సరిహద్దుగా ఉంటుంది ఎక్కువగా ఇతర జిల్లాల నుంచి వలస వచ్చి స్థిరపడిన వారు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ పార్లమెంటు స్థానంలో ఇప్పటివరకు గెలిచిన ఎంపీలలో చాలామంది స్థానికేతరులే. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరఫునుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి తాండ్ర వినోద్ రావు రంగంలో ఉన్నారు.. ముగ్గురు బలమైన అభ్యర్థులే కావడంతో ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో పోటీ రసవత్తరంగా మారింది.

    తెరపైకి స్థానికత అంశం

    అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోవడంతో.. ఆ పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు కు ఈసారి అంత వేవ్ కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసినప్పుడు ఖమ్మం జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. అయితే ఈసారి ఆ స్థాయి స్పందన లభించడం లేదు. పైగా భారత రాష్ట్ర సమితి క్యాడర్ చెల్లాచెదురైపోయింది. ఈ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. భద్రాచలంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలిచినప్పటికీ.. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో భద్రాచలం, ఇల్లందు, పినపాక మినహా.. మిగతా ఏడు నియోజకవర్గాలైన ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, అశ్వరావుపేట, సత్తుపల్లి, కొత్తగూడెం వస్తాయి.. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గాలలో కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. భారత రాష్ట్ర సమితి ఆశించినత స్థాయిలో ప్రచారం చేయకపోవడం.. కెసిఆర్ లాంటి నాయకుడు ప్రచారం చేసినప్పటికీ కిందిస్థాయి నాయకులు కదలకపోవడంతో ఒక రకమైన స్తబ్దత నెలకొందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

    నెటిజన్లు ఓపెన్ గా చెప్పేస్తున్నారు..

    ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి రఘురామిరెడ్డి తరఫున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రఘురామిరెడ్డి పెద్ద కుమారుడు హీరో వెంకటేష్ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ వెంకటేష్ ఇటీవల ప్రచారం చేశారు. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత కూడా ప్రచారంలో పాల్గొన్నది. అయితే ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. “మా మామగారు ఏది టేకప్ చేసినా కష్టపడి పూర్తి చేస్తారు .. మీ ప్రాబ్లమ్స్ మొత్తం ఢిల్లీ దాకా తీసుకెళ్తారు. అది నా హామీ. మా మామకు మీరు సపోర్ట్ చేయండి” అంటూ ఆశ్రిత మాట్లాడింది. దీనిపట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ” మీ మామకు ఖమ్మం జిల్లాతో ఎటువంటి సంబంధం ఉంది? యూరప్ లో వ్లాగ్స్.. కట్ చేస్తే ఇక్కడికి.. మీకేంటి వెయ్యి ఎకరాలు ఉంది.. ఎన్నికలప్పుడు వచ్చి ఇలానే మాట్లాడతారు.. తర్వాత ఎవరూ అందుబాటులో ఉండరు.. మీ మామ నాన్ లోకల్.. మేము ఎందుకు వేయాలి ఓటు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో “భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ లోకల్.. పాల్వంచకు చెందిన వ్యక్తి.. మేము ఆయనకే ఓటు వేసి గెలిపిస్తామని” కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఇదే ఫలితం వ్యక్తమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఖమ్మంలో పోటీ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే ఉందని.. ఈసారి గేమ్ చేంజర్ లాంటి రిజల్ట్ వస్తుందని చెబుతున్నారు.