HomeతెలంగాణKTR Viral Speech: హౌలా.. లుచ్చా.. వాడు పీకేది లేదు.. ఇవేం మాటలు కేటీఆర్ సార్.....

KTR Viral Speech: హౌలా.. లుచ్చా.. వాడు పీకేది లేదు.. ఇవేం మాటలు కేటీఆర్ సార్.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

KTR Viral Speech: రాజకీయాలు హుందాగా ఉండాలి. రాజకీయ నాయకులు మాట్లాడే భాష పరిపక్వతతో ఉండాలి. భాష విషయంలో రాజకీయ నాయకులు అడ్డగోలుగా వ్యవహరిస్తే.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.

రాజకీయ నాయకులు ఇటీవల కాలంలో భాష విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తాము చట్టసభల్లో ఉన్నామనే సోయి కూడా వారికి ఉండడం లేదు. అందువల్లే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. చివరికి వ్యక్తిగత కు సంస్కారానికి దిగుతున్నారు. దీనివల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. రాజకీయ నాయకుడు తమ వైరిపక్ష నాయకులను ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా చూడటం వల్లే అసలు సమస్య ఎదురవుతోంది. దీనికి తోడు తమకంటూ వైరి పక్షం ఉండకూడదు.. ఎదురనేది ఉండకూడదనే భావన వారిలో పెరిగిపోయింది. అందువల్లే శత్రు శేషం లేకుండా ఉండడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. తెర వెనుక రకరకాల మయోపయాలకు దిగుతున్నారు. అంతిమంగా ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి వైరి పక్ష నాయకులను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తున్నారు. కాకపోతే మనదేశంలో చట్టాలు, న్యాయస్థానాలు ఏకపక్షంగా వ్యవహరించవు కాబట్టి.. అలాంటివారు ఎక్కువ కాలం జైల్లో ఉండలేకపోతున్నారు. ఇక ఇదే సమయంలో జైలు నుంచి విడుదలైన తర్వాత వైరి పక్షం నాయకులు పగను పెంచుకుంటున్నారు. వారు కూడా అదే స్థాయిలో స్పందించడం మొదలుపెడుతున్నారు.. అంతకుమించి అనే రేంజ్ లో భాషను ప్రయోగిస్తున్నారు. ఇలా తిట్టే క్రమంలో బూతులు కూడా నేతల నోటి వెంట నుంచి ధ్వనిస్తున్నాయి.

అప్పుడు జైల్లో వేశారు కదా..

గతంలో రేవంత్ రెడ్డిని కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జైల్లో వేశారు. రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అప్పటి కెసిఆర్ ప్రభుత్వం అనేక రకాలుగా ఆయనను బయటకు రాకుండా చూసింది. ఆయనపై రక రకాలుగా కేసులు పెట్టింది. రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడే ఆయన కూతురు వివాహం జరిగింది. కూతురు వివాహాన్ని కారణంగా చూపి రేవంత్ రెడ్డి బయటకి వచ్చారు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ జైలుకు వెళ్లిపోయారు. జైలుకు వెళ్లిన తర్వాత.. జైల్లో ఇబ్బంది పడ్డ తర్వాత.. రేవంత్ రెడ్డి తనకున్న శక్తి యుక్తుల ద్వారా బయటికి వచ్చారు. ఆ తర్వాత కెసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అదే దిశగా పనిచేశారు. ఇప్పుడిక కేటీఆర్ టార్గెట్ గా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇప్పటికే ఒకదఫా కల్వకుంట్ల తారక రామారావును విచారించారు. సోమవారం సుదీర్ఘ సమయం విచారించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తీవ్రస్థాయిలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి “హౌలా, లుచ్చా, వాడు పీకేది ఏమీ లేదు, జైల్లో వేసుకుంటే వేసుకో పో, వాడో లంగా పని చేసిండు. అందుకే నెల రోజులపాటు జైల్లో ఉన్నాడు” అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

Also Read:  KTR ACB Notice : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్

తెలంగాణ సమాజంపై తీవ్ర ప్రభావం

వాస్తవానికి కల్వకుంట తారక రామారావు మాట్లాడిన మాటలు గులాబీ పార్టీ కార్యకర్తలకు ఆనందంగా ఉండి ఉండవచ్చు. కానీ అంతిమంగా అవి తెలంగాణ సమాజంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే కేటీఆర్ విద్యావంతుడు. గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నవాడు. అటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం.. అది కూడా గౌరవ వచనం లేకుండా సంబోధించడం తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంది. అన్నట్టు ఇలాంటి మాటలు మాట్లాడి.. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడి కేటీఆర్ ఎలాంటి సందేశం తెలంగాణ సమాజానికి ఇస్తున్నారు తెలియాల్సి ఉంది. అన్నట్టు ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం వరకు వెళ్లిన కేటీఆర్ కు అక్కడ అనుకూల ఫలితం రాలేదు. చివరికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కేటీఆర్ పై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అలాంటప్పుడు కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల విచారణకు హాజరు కావాల్సిందే కదా. ఇంతోటి దానికి ఈ బల ప్రదర్శన దేనికి? ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు దేనికని? కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular