KTR
KTR: తెలంగాణలో అధికారం చేతులు మారి వంద రోజులు దాటింది. పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది. ఇక పదేళ్లు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలనపై విసుగు చెందిన ప్రజలకు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు ఇతర హామీలు ఆశాదీపంలా కనిపించాయి. దీంతో బీఆర్‌ఎస్ స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చారు. ఇక బీఆర్‌ఎస్ ఓటమిపై సమీక్ష చేసుకోకుండా తమ ఓటమికి కాంగ్రెస్ హామీలే కారణమని ఆరోపిస్తోంది. కానీ, కర్ణుడి చావుకు కారణాల్లా.. బీఆర్‌ఎస్ ఓటమి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇక ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్‌ఎస్ నేతలు.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు పోటీ పడుతున్నారు. గతంలో పంటలు ఎండిపోయినా, వర్షాలకు కొట్టుకుపోయినా రూపాయి పరిహారం ఇవ్వని నేతలు ఇప్పుడు ఎండిన పంటలకు రూ.25 వేల పరిహారం డిమాండ్ చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల వేళ మాటల యుద్ధం..
ఇక లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అధికార పార్టీపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఇటు అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్‌తోపాటు మంత్రులు తిప్పి కొడుతున్నారు. ఈ క్రమంలో మాటలు కూడా అదుపు తప్పుతున్నాయి. దూషణల పర్వం పెరుగుతోంది. ఛాలెంజ్‌లు చేసుకుంటున్నారు.
రేవంత్ ఇలా విఫలమయ్యారట..
ఇక అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సీఎంగా రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. ఐదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే రేవంత్‌రెడ్డి తనకు తానే ఫెయిల్ అవుతారని జోష్యం చెప్పారు. ఈ విషయం రేవంత్‌కు కూడా తెలుసని ఎద్దేవా చేశారు. తెలంగాణ సంపదను పెంచడంలో సీఎం ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై పెట్టిన శ్రద్ధ.. వాటర్ ట్యాప్‌లమీద పెట్టడం లేదని పేర్కొన్నారు.
ఓడిపోయే అభ్యర్థులను పెట్టి..
ఇక రేవంత్‌రెడ్డి బీజేపీతో కుమ్మక్కై లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయే అభ్యర్థులను నిలిపారని ఆరోపించారు. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌లో రేవంత్‌రెడ్డి కావాలనే ఓడిపోయే అభ్యర్థులను నిలిపారని పేర్కొన్నారు. చేవెళ్ల టికెట్ కోసం పట్నం ఫ్యామిటీ కాంగ్రెస్‌లో చేరితే రేవంత్ మాత్రం మల్కాజిగిరిలో నిలిపారని పేర్కొన్నారు. చేవెళ్లలో పనికిరాని చెత్తను మల్కాజిగిరిలో వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్‌ను ఖతం చేయాలని..
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఖతం చేయాలని రేవంత్‌రెడ్డి బీజేపీతో చేతులు కలిపాడని ఆరోపించారు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్, కొన్ని స్థానాల్లో బీజేపీ గెలిచేలా ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ కాంగ్రెస్ పార్టీలోని 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలో చేరతారని ఆరోపించారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ktr told why revanth reddy failed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com