HomeతెలంగాణKCR: దేశోద్ధారకుడిని అంటివి.. ఇప్పుడేమో ఇలా అంటున్నావేమీ కేసీఆర్ సార్

KCR: దేశోద్ధారకుడిని అంటివి.. ఇప్పుడేమో ఇలా అంటున్నావేమీ కేసీఆర్ సార్

KCR: పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. తెలుగులో ఒక మంచి సామెత ఇది. అధికారం.. అహంకారంతో కమ్ముకున్నప్పుడు ఎవరికైనా ఇదే పరిస్థితి. రాజకీయ నాయకులకు పదవి, అధికారం ఉన్నప్పుడు.. తాము ఎంత చెబితే అంత.. అందరికంటే తామే అధికులం, మేధావులం అనుకుంటారు. ఒక్కసారి అధికారం పోతే.. గ్రౌండ్‌ లెవల్‌ అర్థమవుతుంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావుకు ఇది బోధపడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్‌.. నేల విడిచి సాము చేశారు. తమకు ఎదురే లేదనుకున్నారు. ప్రజలే నిర్ణేతలు.. వాళ్లు గెలిపిస్తేనే అధికారంలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి, కేటీఆర్‌ ముఖ్యమైన మంత్రిగా అధికారం చెలాయించారు.

మాకన్నా గొప్ప ఎవరు అన్నట్లు..
పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ప్రజలకు సంక్షేమం పేరిట బిస్కెట్లు వేసి.. తన ఇష్టారాజ్యంగా పాలన సాగించారు. యాదాద్రి ఆలయ స్తంభాలపై బొమ్మలు చెక్కించుకున్నారు. తెలంగాణ జాతిపిత అని కీర్తింపజేసుకున్నారు. గాంధీ, అంబేద్కర్‌ కంటే కేసీఆరే గొప్ప అన్నట్లుగా పార్టీ నేతలతో పొగిడించుకున్నారు. తన చిత్రపటానికి పాలాభిషేకాలు చేయించుకున్నారు.

నేనే తెలివి మంతుడిని అని..
ఇక తనను మించిన తెలివి వేరెవరికీ లేదన్నట్లుగా తూలనాడారు. ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్‌ చేసి తెలివి తక్కువోడు అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దేశాన్ని అభివృద్ధి చేయడం చేతకాలేదని, దేశాన్ని ఉద్దరించేది తానే అని, ఆ బాధ్యత 2024లో స్వీకరిస్తానని ప్రకటించారు. దేశ రాజకీయాల్లోకి పోవాలా అని తెలంగాణలో సభలు పెట్టి అడిగారు. దేశం మొత్తం కేసీఆర్‌ పాలన కోరుకుంటోందని తన మంత్రులు, ఎమ్మెల్యేలతో చెప్పించుకున్నారు.

కూటమి కోసం దేశాటన..
ఈ క్రమంలో మూడో కూటమి ఏర్పాటుకు కేసీఆర్‌ చాలా ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం దేశాటన చేశారు. అయితే కేసీఆర్‌ నాయకత్వాన్ని ఎవరూ అంగీకరించలేదు. ఆయనతో కలిసి పనిచేయడానికి ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు. దీంతో కథ అడ్డం తిరిగింది. అయినా వెనక్కి తగ్గని కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చేశాడు. మహారాష్ట్ర నుంచి నాయకులను పట్టుకొచ్చి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నాడు. తెలంగాణ, మహారాష్ట్రలో పార్టీ కార్యాలయాలు తెరిచాడు. ‘నేను మాత్రమే బీజేపీని, నరేంద్రమోదీని ఎదిరించి నిలబడి పోరాడగలను.. నేను మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలను’ అని గర్వంగా చెప్పుకున్నారు.

ఇంట ఓడిపోవడంతో..
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు.. కానీ, కేసీఆర్‌ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సొంత రాష్ట్రంలోనే పార్టీని గెలిపించుకోలేకపోయారు. దీంతో దేశంలో ఏం గెలిపిస్తాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ ఓటమి తర్వాత నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో పార్టీ కార్యాలయానికి తాళం వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో చేరినవారంతా శివసేన, బీజేపీలో చేరారట. ఏపీలో కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల స్వరం మారింది.

నేను నుంచి మనందరం వరకు..
ఓటమి తర్వాత కేసీఆర్‌కు తన స్థాయి ఏమిటో తెలిసి వచ్చింది. దీంతో ఇప్పుడు గులాబీ నేతలు కొత్త స్వరం అందుకున్నారు. ఇన్నాళ్లూ కేసీఆర్‌తోనే దేశ అభివృద్ధి సాధ్యం అన్నవారు.. ఇప్పుడు బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌ పార్టీకి, ఇండియా కూటమికి లేదంటున్నారు. బీఆర్‌ఎస్, ఆమ్‌ఆద్మీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని ఎదుర్కొంటాయి అని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోనే చెప్పిస్తున్నారు కేసీఆర్‌. కేసీఆర్‌ కూడా బీజేపీని ఎదుర్కొలేరు అని పరోక్షంగా అంగీకరించారు. మొన్నటి వరకు నేను అన్న కేసీఆర్‌ ఇప్పుడు… మనందరం అనేస్థాయికి దిగివచ్చారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular