KTR: రేవంత్ చేసిన అప్పుల చిట్టా బయటపెట్టిన కేటీఆర్..

రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన కేవలం పది నెలల కాలంలోనే రూ.80,500 కోట్ల రికార్డు స్థాయి అప్పు తీసుకొచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇంతవరకు ఎన్నికల హామీలు తీర్చలేదని.. ఓ సాగు ప్రాజెక్టు నిర్మాణమూ చేపట్టలేదని.. మరి ఇంత అప్పు దేని కోసం చేశారని నిలదీశారు.

Written By: Srinivas, Updated On : October 16, 2024 2:45 pm

KTR(3)

Follow us on

KTR: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు గడుస్తోంది. ఈ క్రమంలో గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుండగా.. అందుకోసం భారీ మొత్తంలో అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో కాంగ్రెస్ పెద్దలు కూడా చెబుతూ వచ్చారు. అయితే.. తాజాగా ఆ అప్పుల లెక్కలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయట పెట్టారు. కాంగ్రెస్ కొలువుదీరినప్పటి నుంచి తీసుకొచ్చిన అప్పుల చిట్టాను చదివి వినిపించారు. పది నెలల్లోనే వేల కోట్ల అప్పులు చేశారని భగ్గుమన్నారు. ఇంకా ముందు ముందు ఆ అప్పులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన కేవలం పది నెలల కాలంలోనే రూ.80,500 కోట్ల రికార్డు స్థాయి అప్పు తీసుకొచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇంతవరకు ఎన్నికల హామీలు తీర్చలేదని.. ఓ సాగు ప్రాజెక్టు నిర్మాణమూ చేపట్టలేదని.. మరి ఇంత అప్పు దేని కోసం చేశారని నిలదీశారు. రూ.80వేల కోట్ల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. అప్పులు తప్పు అన్నోళ్లు.. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు అప్పులు చేశారని అడిగారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకు ధారాదత్తం చేశారా..? కమీషన్ల కోసం కక్కుర్తి పడి అప్పులు చేస్తున్నారా..? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల ప్రచారంలో అప్పు శుద్ధ తప్పు అని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు అప్పు చేయాల్సి వస్తోందని కేటీఆర్ నిలదీశారు. తమ ప్రభుత్వం హయాంలో అప్పులు తెచ్చినా ప్రాజెక్టులు నిర్మించామని, ప్రతీ పైసాతో మౌలిక సదుపాయాలు పెంచుతూ వచ్చామని, తీసుకున్న రుణంతో దశాబ్దాల బాధలు పోయేలా చేశామని వెల్లడించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల అడ్రస్ ఎక్కడ అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా.. ఒక్క ప్రాజెక్టు కట్టకుండా.. నెలలపాటు జీతాలు ఇవ్వకుండా… ఇన్ని వేల కోట్ల అప్పులు ఎందుకోసం చేశారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర బాగు కోసం కాకుండా సొంత ఆస్తులు పెంచుకునేందుకే అప్పులు చేశారని ఆరోపించారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.

ఆర్బీఐ నుంచి తెలంగాణ మరో వెయ్యి కోట్ల అప్పు తీసుకున్నట్లు నిన్న స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది. దీంతో రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కేవలం 315 రోజుల్లో రూ.74,495 కోట్ల అప్పు చేశారు. గత నెలలో మూడు దఫాలుగా రూ.4,500 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈనెల 1న రూ.2,000 కోట్ల అప్పు తెచ్చారు. తాజాగా.. 21 ఏండ్ల కాలానికి బాండ్ జారీ చేసి మరో రూ.వెయ్యికోట్లు తీసుకొచ్చారు. ఇలా ప్రతినెలా రూ.5వేల నుంచి 6వేల కోట్ల వరకు రేవంత్ సర్కార్ రుణాలు సమీకరిస్తోంది. కేవలం ఒక్క ఆర్బీఐ నుంచే రూ.49,618 కోట్ల అప్పులు తెచ్చింది. వీటితోపాటు పలు కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు గ్యారంటీలు ఇచ్చి మరో రూ.25వేట్ల కోట్ల వరకు అప్పులు తీసుకొచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.