KTR: ప్రజల తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో మరోసారి టాప్‌లో దూసుకుపోతోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం దాదాపు రెండు రెట్లు మెరుగ్గా ఉందని ఇప్పటికే ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజల ఆదాయం మెరుగుపడినట్లు చాలాసార్లు రుజువైంది.
తాజాగా మరోమారు..
తలసరి ఆదాయంలో తెలంగాణ మరోమారు మొదటి వరుసలో నిలిచింది. ఇదే విషయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోని పెద్ద రాష్ట్రాల జాబితాలో నంబర్ వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. అయినా ఏం చేశావ్ కేసీఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూనే ఉంటాయని ట్వీట్ చేశారు. చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి అని ట్వీట్‌లో వివరించారు.
ది మ్యాప్స్ డైలీ ఇమేజ్‌తో..
తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్‌కు ది మ్యాప్స్ డైలీ ఇమేజ్‌ను కూడా జత చేశారు. జాతీయ తలసరి ఆదాయం సగటు రూ.1.72 లక్షలు ఉండగా, తెలంగాణ తలసరి ఆదాయం మాత్రం రూ.3.09 లక్షలుగా ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో 2014–15లో తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో 11వ స్థానంలో ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకన్నా ముందు వరుసలో నిలిచింది. తెలంగాణ ముందు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఉన్నాయి.