Komatireddy vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా, దానిని వ్యతిరేకిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడంతో వార్తలకెక్కుతున్నాడు. గతంలో రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ట్వీట్ లు మాత్రమే చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉటంకిస్తూ కోమటిరెడ్డి బ్రదర్ చేసిన ట్వీట్ మళ్లీ చర్చకు దారితీసింది. దానికి కారణాలు ఏమైనా, రేవంత్ రెడ్డిని విమర్శించేందుకు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదనే కోపమే అని అంటున్నారు.
వీరిద్దరికీ ఎక్కడ చెడింది
గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో కాంగ్రెస్ లో చేరిన ఆయనకు సమయం అనుకూలించలేదు. పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి కి అప్పగించిన తరువాత ఏకంగా అప్పటి ఇంచార్జి కి డబ్బులు ఇచ్చి ఆ పదవి కొనుక్కున్నాడని రేవంత్ పై చేసిన విమర్శ కాంగ్రెస్ పార్టీ లో కలకలం సృష్టించింది. అది మొదలు రేవంత్ రెడ్డిపై విరుచుకు పడడమే పనిగా పెట్టుకొని, ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిపై విమర్శల పరంపర కొనసాగించాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుగా రేవంత్ రెడ్డి ఆయన చేసిన విమర్శలను పెద్దగా లెక్కచేయలేదు. తన లక్ష్యం వైపు మాత్రమే దూసుకెళ్లాడు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత సీఎం రేసులో సైతం తాను ఉన్నట్లు రాజ గోపాల్ రెడ్డి ప్రచారం చేసుకున్నారు. అధిష్టానం కూడా తమవైపు చూస్తున్నారని కలలు కన్నాడు. కానీ అందుకు గ్రౌండ్ వర్క్ కూడా చేయని కోమటి బ్రదర్స్ ఆ పదవిని ఆశించడం. తమకు తామే మీడియా లో ప్రోజెక్ట్ చేసుకోవడం వరకే పరిమిత మయ్యారు. కానీ రేవంత్ రెడ్డిని అధిష్టానం ముఖ్యమంత్రిని చేసిన తరువాత ఒక్కసారిగా ఆ మాయ నుంచి బయటికి వచ్చిన కోమటి బ్రదర్స్ తమ స్థానం ఏంటో తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ రాజగోపాల్ రెడ్డి కనీసం మంత్రి పదవి కూడా సాధించలేకపోవడం, అందుకు ఏవేవో కారణాలు తనకు తానే ఊహించుకొని, అనుచర గణానికి, స్నేహితులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆయనకు నిత్యం బాకా ఊదే కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు పదేపదే మంత్రి పదవి విషయంలో ఆయన్ను ప్రశ్నించడం, ఆయన ఏదో ఈక్వేషన్లు చెప్పి తప్పించుకోవడం పరిపాటైంది. అధిష్టానంపై విశ్వాసం అంటూనే, రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయడం వ్యతిరేక ప్రభావం చూపుతుందని ఆలోచించకోవడంతో ఇంకా ఆయన అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోతున్నాడని అర్థమవుతుంది.
ఏదో విధంగా ప్రతిదినం వార్తల్లో ఉండాలనే అలవాటుతో ప్రతీ విషయంపై స్పందించడం కూడా ఆయనకు అవకాశాలను దూరం చేస్తున్నాయని తెలుసుకోలేకపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి ధిక్కారానికి కారణమేంటి?
కోమటిరెడ్డి బ్రదర్స్ పై అధిష్టానం కన్ను
కోమటిరెడ్డి బ్రదర్స్ ఏవిధంగా వ్యవహరిస్తున్నారు. పార్టీపై ఎంతవరకు విశ్వాసంలో ఉన్నారు. అధినాయకత్వం విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే విషయంలో అధిష్టానం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. వీటివల్ల పార్టీకి ఎంత లాభం, ఎంతవరకు నష్టం అనే విషయాలపై ఎప్పటికప్పుడు వారి కార్యకలాపాలను అధిష్టానం బేరీజు వేసుకున్నట్లు తెలుస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వారు చేస్తున్న ప్రతీ కామెంట్ ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో మౌనం వహించడం తప్ప గత్యంతరం లేదనే సత్యం తెలుసుకోవాలని ఆయన శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.