Komatireddy Venkatareddy : తెలంగాణ కాంగ్రెస్‌లో ముగ్గురు నలుగురు ఏక్‌నాథ్‌షిండేలు ఉన్నారని విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి మరో షిండే అవుతారని, 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరతాడని ఆరోపిస్తున్నారు. రేవంత్ టార్జెట్ గానే కాంగ్రెస్ ప్రభుత్వం దానికదే కూలిపోతుందని జోష్యం చెబుతున్నారు. ఇక బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అయితే.. ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని లోక్‌సభ ఎన్నికల తర్వాత షిండేగా మారతారని పేర్కొంటున్నారు. పదే పదే బీఆర్‌ఎస్, బీజేపీ నేతలను తనను టార్గెట్ చేయడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫీల్ అవుతున్నారు.
పదేళ్లు రేవంతే సీఎం..
బీఆర్‌ఎస్, బీజేపీ నేతల విమర్శలతో కోమటిరెడ్డిపై పార్టీలో అపనమ్మకం పెరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఇలాగే విమర్శలు వచ్చాయి. కాంట్రాక్ట కోసమే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి ఉప ఎన్నికలు తెచ్చారని బీఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దానిని ప్రజలు నమ్మారు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని ఓడించారు. ఇప్పుడు అదే భయం వెంకటరెడ్డికి పట్టుకుంది. బీఆర్‌ఎస్, బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ అధిషా‍్టనం నమ్మితే తన పదవికి ముప్పు వస్తుందని భావించిన వెంకటరెడ్డి.. తాను షిండేను కాదని చెప్పేందుకు.. వచ్చే పదేళ్లు రేవంత్‌రెడ్డి సీఎంగా ఉంటారని ప్రకటించారు.
గ్రూపులు లేవట..
అంతేకాదు.. గ్రూపులకు కేరాఫ్ అయిన తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు గ్రూపులే లేవని కోమటిరెడ్డి సర్టిఫికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉండడంతోపాటు వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెబుతున్నారు. కావాలని కొందరు తనను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మరోమారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు.
కోమటిరెడ్డిపైనే ఎందుకు..
ఇక బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డినే షిండేగా ప్రచారం చేయడం వ్యూహాత్మకమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్.. రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడగా, వెంకటరెడ్డి, తనకు టీపీసీసీ పగ్గాలు అప్పగించనందుకు అలిగారు. రేవంత్ నాయకత్వంలో పనిచేయనని ప్రకటించారు. కొన్ని రోజులు రేవంత్‌తో ఎడమొహం, పెడమొహంలా ఉన్నారు. దీంతో రేవంత్‌ను గద్దె దించేందుకు కోమటిరెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మహేశ్వర్‌రెడ్డి, కేంద్ర మంత్రితో కూడా తాను షిండేగా మారతానని కోమటిరెడ్డి చెప్పారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయననే బీజేపీ, బీఆర్‌ఎస్ టార్గెట్ చేస్తున్నాయి. ఈ ప్రచారం ఎంత పెరిగితే.. తనపై నమ్మకం అంత సడలి మొదటికే మోసం వస్తుందని కోమటిరెడ్డి ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంకో సారి ఎవరైనా తనను షిండే అంటే గట్టిగా సమాధాన చెప్పాలని భావిస్తున్నారు.