Raj Gopal Reddy sensational comments: కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమయం దొరికిన ప్రతిసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విభజిస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో అవినీతిని ఎండగడుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు పట్ల ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడమే.
మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ తనకు హామీ ఇచ్చిందని.. ఆ తర్వాత దానిని విస్మరించిందని రాజగోపాల్ రెడ్డి ఇటీవల తరచూ ఆరోపిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపి ఇలా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన పరోక్షంగా పేర్కొంటున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఆయన మొహమాటం లేకుండా బయటపెడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. శాసనసభలో తాను ఉండలేనని వ్యాఖ్యానించారు రాజగోపాల్ రెడ్డి.. ఇక గ్రూప్ 1 వ్యవహారంలోనూ రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్ తరహాలోనే యువత తిరగబడి ప్రభుత్వాన్ని కూల్చివేయడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదని.. నిరుద్యోగులను గాలికి వదిలేయవద్దని.. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం వారు విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంలోకి రావాలని.. ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని.. ప్రజల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం.. హంగు ఆర్భాటాలు చేయడం వెనక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు.
నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదు. నిరుద్యోగులను… pic.twitter.com/xYLePEsjRR
— (@Nallabalu1) September 17, 2025