HomeతెలంగాణKishan Reddy: వ్యవసాయ రంగానికి బిజెపి దిక్సూచి: కిషన్ రెడ్డి.. బాధ్యతగా వ్యవహరించిన "ఏరువాక"

Kishan Reddy: వ్యవసాయ రంగానికి బిజెపి దిక్సూచి: కిషన్ రెడ్డి.. బాధ్యతగా వ్యవహరించిన “ఏరువాక”

Kishan Reddy: తెలంగాణలో సాగు సమస్యలపై ఏరువాక రైతు సామాజిక సాధికార మాస పత్రిక సరికొత్త ప్రశ్న అస్త్రాలను సంధించింది. తెలంగాణలో రైతు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించింది. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీవీ9 తెలంగాణ థింగ్స్ టుడే పేరిట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉత్సాహభరిత వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది. వివిధ మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు.

ఏరువాక రైతు సాధికారిత మాస పత్రిక ఎడిటర్ గారా రాఘవరావు కేంద్ర ప్రభుత్వ సేవలను అభినందిస్తూనే.. వ్యవసాయపరంగా ఆశించిన స్థాయిలో శ్రద్ధ చూపని వైనాన్ని ప్రస్తావించారు. “జై జవాన్.. జై కిసాన్” అన్న నినాదంతో మోదీ సర్కార్ ముందుకెళ్తోందని.. జై జవాన్ విషయంలో కనిపిస్తున్న పురోగతి.. వ్యవసాయం విషయంలో కనిపించడం లేదని ప్రస్తావించారు. ముఖ్యంగా తెలంగాణలో సాగునీటి వనరుల సద్వినియోగం విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యల గురించి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి బాధ్యతాయుతమైన మీడియాగా చక్కటి ప్రశ్నలు సంధించారని రాఘవరావును అభినందించారు.

దేశంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వాజపేయి హయాంలోనే నదుల అనుసంధాన ప్రక్రియను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందుకుగాను ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. అయితే 2004లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఈ దేశ రైతాంగానికి దురదృష్టకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు బిజెపి అనుసరించిన విధానాలను.. యూపీఏ కొనసాగించి ఉంటే ఈ దేశంలో వ్యవసాయం రంగం గణనీయమైన అభివృద్ధి సాధించి ఉండేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోజు చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియ ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

వ్యవసాయ ఉత్పత్తులు, సహకార రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత బిజెపి దేనిని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ” ఒకే దేశం- ఒకే మార్కెట్ ” విధానాన్ని తీసుకొచ్చి దళారీ వ్యవస్థ లేకుండా చేసిన ఘనత మోడీ సర్కారుదేనని తేల్చి చెప్పారు. రైతు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా విక్రయించే అధికారాన్ని కట్టబెట్టిన విషయాన్ని సైతం గుర్తు చేశారు. తెలంగాణలో కేవలం ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం 29 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3000 కోట్లు ఖర్చు చేస్తే… దానికి పది రెట్లు బిజెపి ఖర్చు చేస్తున్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఓ ప్రాంతీయ పార్టీ.. దేశంలో బిజెపి అధికారంలో ఉండడం వల్ల.. కొన్ని రకాల రాజకీయ అంశాలు తెరపైకి వచ్చిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. అందుకే తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే.. వ్యవసాయ అనుబంధ రంగాల రూపు రేఖలు మార్చుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి మంచి ప్రశ్నలతో ఆలోచింపజేసిన ఏరువాక రైతు సాధికారత మాసపత్రిక ఎడిటర్ గారా రాఘవరావుకు తోటి పాత్రికేయ మిత్రులు, బిజెపి నేతలు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version