Khammam Jana Garjana Sabha : అడ్డంకులు సృష్టించినా.. ఖమ్మం జన గర్జన ఆగలే

పొంగులేటి చేరిక, భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని ప్రజా గర్జన పేరుతో ఖమ్మంలో ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా భారీగా చేసింది.

Written By: Bhaskar, Updated On : July 2, 2023 10:00 pm
Follow us on

Jana Garjana Sabha : ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. పొరుగు జిల్లాల నుంచి ఆర్టీఏ అధికారులను రప్పించారు. వాహనాలను తనిఖీ చేశారు. అంతే కాదు పెట్రోల్‌ బంక్‌లను మూసేశారు. ఇంధనం దొరకకుండా చేశారు. ఇదీ అధికార బీఆర్‌ఎస్‌ సాగించిన దాష్టీకం. జనగర్జన సభను విఫలం చేసేందుకు పన్నిన పన్నాగం. అయినప్పటికీ ఉత్తుంగ తరంగంలా జనం కదిలారు. కాంగ్రెస్‌ జెండాలను చేత పట్టుకుని ఉత్సాహం ప్రదర్శించారు.

పొంగులేటి చేరిక, భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని ప్రజా గర్జన పేరుతో ఖమ్మంలో ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా భారీగా చేసింది. గత కొంతకాలంగా ఉత్సాహం తొణకిసలాడుతున్న ఆ పార్టీ.. ఈ సభను విజయవంతం చేసేందుకు తీవ్ర కసరత్తు చేసింది. ఖమ్మం మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసింది. దీనికితోడు నేతలు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో జనం భారీగా వచ్చారు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న వారు పోటాపోటీగా జన సమీకరణ చేశారు. అయితే ఈ పరిస్థితిని ముందే గమనించిన అధికార పార్టీ ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు.

ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇచ్చేందుకు నిరాకరించారు. ‘ఆర్టీసీకి రోజుకు రెండు కోట్ల ఆదాయం వస్తుంది. ఈ నగదును నేను ఇస్తాను. ఆర్టీసీ బస్సులు కేటాయించండి అంటూ’ పొంగులేటి కోరారు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్ల బస్సులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ప్రైవేట్‌ బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేసుకుని వస్తుండగా పోలీసులు నిలువరించారు. కొన్ని చోట్ల కేసులు కూడా నమోదు చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు రెండు వేల వాహనాలను పోలీసులు సీజ్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో పరిస్థితిని కార్యకర్తలు పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రేవంత్‌రెడ్డితో మాట్లాడారు. అనంతరం రేవంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి డీజీపీ హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు అప్పుడు చెక్‌ పోస్టులు ఎత్తేశారు.

సభా వేదిక వద్దకు రేణుకా చౌదరి వస్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. వీ హన్మంతరావును నిలువరించారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రేణుకా చౌదరి బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఒకింత టెన్షన్‌ వాతావరణం నెలకొంది. డీజీపీ నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు బారికేడ్లను తొలగించారు. మొత్తానికి సభను విఫలం చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది అనే సంకేతాలు వెళ్లడంతో ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి వచ్చారు. సుమారు 5 లక్షల మంది వస్తారని కాంగ్రెస్‌ అంచనా వేసింది. అయితే 2.50 లక్షల మంది వచ్చారని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9 సీట్లు ఇచ్చిన ఖమ్మం నుంచే కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం ఊదింది. నేతలు మొత్తం ఏకతాటి పై ఉండి సభను విజయవంతం చేశారు. జూపల్లి కృష్ణారావు ఇదే వేదికపై కాంగ్రెస్‌లో చేరతారు అని భావించినప్పటికీ.. ఆయన ఖమ్మం రాలేదు. కేవలం పొంగులేటి మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కండువా కప్పి రాహుల్‌ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ కూడా ఈ సభా వేదిక మీద కన్పించడం విశేషం. రాహుల్‌ గాంఽధీని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు.