Khammam Floods : కళ్ళముందే అమ్మానాన్న కొట్టుకుపోయారు.. ఎనిమిది గంటల పాటు మున్నేరులో నరకయాతన..

జడవాన కురిసింది. మిన్ను మన్ను ఏకమైంది. ఉధృతమైన వరద ప్రవాహానికి తీవ్ర నష్టం చోటుచేసుకుంది. నగరం, పట్టణం, గ్రామం, వీధి అని తేడా లేకుండా వాన నీరు అన్నింటిని ముంచేసింది. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాలలో అయితే చెరువు కట్టలు తెగి గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి.

Written By: NARESH, Updated On : September 4, 2024 10:44 pm

Khammam Floods

Follow us on

Khammam Floods : ఇటీవల కురిసిన భారీ వర్షానికి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా లో తీవ్రమైన నష్టం చోటుచేసుకుంది. పంటలు నాశనమయ్యాయి. గ్రామాలు నీట మునిగాయి. ఇళ్లు నామరూపాలను కోల్పోయాయి.. మున్నేరు వరద ప్రవాహం ఖమ్మం నగరాన్ని నిండా ముంచింది. కాల్వొడ్డు, సారధి నగర్, సాయి గణేష్ నగర్, బొక్కల గడ్డ, ముస్తఫా నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒకటో అంతస్థు వరకు నీరు చేరడంతో చాలామంది తీవ్రంగా నష్టపోయారు. ఇంటి సామగ్రి పూర్తిగా తడవడంతో దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయారు. ఇదే సమయంలో ఆకస్మాత్తుగా చుట్టుముట్టిన వరద చాలామంది ప్రాణాలు తీసింది. అందులో ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో కూసుమంచి మండలం నాయక్ గూడెం గ్రామంలో యాకూబ్ కుటుంబం గల్లంతయింది. నాయకన్ గూడెం గ్రామంలో షేక్ యాకుబ్, అతని భార్య సైదాబీ నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు.. అయితే ఇటీవల కురిసిన వర్షానికి వరద నీరు యాకూబ్ ఇంటిని చుట్టుముట్టింది. క్షణాల్లో వరద విపరీతం కావడంతో వారు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సాయం కోసం వారు ఇంటి గోడ పైకి ఎక్కారు. ఈ నేపథ్యంలో వారిని రక్షించేందుకు అధికారులు చేయని ప్రయత్నం అంటూ లేదు. హకీంపేట, బేగంపేట, విజయవాడ నుంచి హెలికాప్టర్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో అవి వచ్చేందుకు మార్గం లేకపోయింది. దీంతో మోతే ప్రాంతం నుంచి డ్రోన్లు తెప్పించి ప్రత్యేకంగా లైఫ్ జాకెట్లు వారికి అందించారు. అయితే యాకూబ్ కుటుంబంలోని ఇద్దరు కుమారులు లైఫ్ జాకెట్లు వేసుకొని వారి ప్రాణాలు కాపాడుకోగా.. యాకుబ్, అతని భార్య సైదాబీ కి లైఫ్ జాకెట్లు అందిస్తుండగా గోడకూలి నీటిలో పడిపోయారు.. ఆ ప్రవాహానికి కొట్టుకుపోయి కన్నుమూశారు. కళ్ళముందే తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ పిల్లల బాధ వర్ణనాతీతంగా ఉంది. మరోవైపు ఆ వరదనీటిలో యాకుబ్ కుటుంబం సుమారు 8 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించింది. ఒకవేళ సమయానికి హెలికాప్టర్ కనుక వచ్చి ఉంటే యాకుబ్ కుటుంబం బతికి బట్టకట్టేది. వాస్తవానికి వారిని కాపాడేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు.. ఆయన ఎన్ని రకాలుగా తన అధికారాన్ని ఉపయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.. అయితే తమ కళ్ళముందే తల్లిదండ్రులు చనిపోవడంతో యాకుబ్ కుమారులు తట్టుకోలేకపోతున్నారు. జరిగిన సంఘటనను తలుచుకొని కన్నీటి పర్యవంతమవుతున్నారు. యాకుబ్ కుమారులలో పెద్ద కుమారుడి ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. నాడు తాము అనుభవించిన బాధను అతను చెబుతుంటే అందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదే సమయంలో ఈ యాకూబ్ కుమారులను ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

https://www.youtube.com/live/ctXu7xh_bPI