https://oktelugu.com/

HYDRA : హైడ్రాకు మరో పవర్‌.. నేడో రేపో ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక కబ్జాదారులకు దబిడిదిబిడే..!

విశ్వనగరం హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటీగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. కబ్జా అయిన చెరువులను చెర విడిపించడంతోపాటు జల వనరులు, ఆస్తులను కాపాడడమే దీని లక్ష్యం. ఈమేరకు ఇప్పటికే పని మొదలు పెట్టింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 25, 2024 / 12:30 PM IST

    HYDRA Powers

    Follow us on

    HYDRA : హైదరాబాద్‌ను గత ప్రభుత్వం విశ్వనగరంగా తీర్చిదిద్దింది. ఇందుకోసం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేశారు. దీంతో పెట్టుబడులు భారీగా వచ్చాయి. ఐటీరంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా హైదారాబాద్‌ అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టిపెట్టింది. ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్క సీటు గెలవకపోయినా.. రాష్ట్ర రాజధానిని ఫ్యూచర్‌ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఇటీవలే అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లొచ్చారు. భారీగానే పెట్టుబడులు వచ్చేలా ఎంవోయూ చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌కు పెట్టుబడులు రావాలంంటే.. ముందుగా ముంపు సమస్య తొలగిపోవాలని భావించారు. అందుకు కబ్జాలే కారణమని గుర్తించారు. ఈ క్రమంలో వందలాది చెరువులను కబ్జాల చెర విడిపించాలని నిర్ణయించారు. ఇందుకోసం హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్సిబుల్‌ అసెట్‌) ఏర్పాటుచేశారు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో నెల రోజులుగా హైడ్రా పని మొదలు పెట్టింది. రాజకీయ నాయకులు, అధికార పక్షం, ప్రతిపక్షం, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా కబ్జాలను కూల్చివేస్తోంది. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లలోని ఆక్రమణలను తొలగిస్తోంది. భవనాలను నేలమట్టం చేస్తోంది. తాజాగా ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. మరోవైపు జన్వాడలోని కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌గా భావిస్తున్న భవనాన్ని కూల్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కేటీఆర్‌ స్నేహితుడు హైడ్రాపై కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు హైడ్రా పరిధి, అధికారాలు, చట్టబద్ధతను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో హైడ్రాకు మరింత పవర్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

    హైడ్రాకు చట్టబద్ధత ఉందా?
    ‘హైడ్రా అనేది ఒక కార్యనిర్వాహక వ్యవస్థ. ఇది జీవో నెం.99 ద్వారా ఏర్పడింది. జులై 19న ఇది జీవో వచ్చింది. జీవోలకు సహజంగానే చట్టబద్ధత ఉంటుంది. గతంలో ఇదే విధంగా 1985లో ఒక జీవో ద్వారా ఏసీబీ ఏర్పడింది. అదే విధంగా జీవో ద్వారా విజిలెన్స్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ వ్యవస్థ కూడా ఏర్పడింది. ఇలా జీవో ద్వారా ఏర్పడిన సంస్థలకు రాజ్యాంగ పరంగా కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. గతంలో ప్లానింగ్‌ కమిషన్, లా కమిషన్‌ కూడా ఇలాగే కార్యనిర్వాహక ఆదేశాలతో ఏర్పడ్డాయి. జీవోల ద్వారా ఏర్పడిన వ్యవస్థలకు చట్టబద్ధత ఉండదు అనడానికి లేదు. ఆక్రమణల తొలగింపు అనేది స్థానిక సంస్థల భాగస్వామ్యంతో చేపట్టాలన్నది హైడ్రా జీవోలోనే ఉంది. ఆ ప్రకారమే ఎఫ్‌ టీఎల్, బఫర్‌ జోన్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది.

    పోలీస్‌ స్టేషన్‌ స్టేటస్‌..
    హైడ్రాను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. హైడ్రాకు పోలీస్‌ స్టేషన్‌ స్టేటస్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల నేరుగా హైడ్రానే ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఇక హైడ్రా కూల్చివేసిన భవనాలకు గతంలో పర్మిషన్‌ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై ఉన్నతాధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపనుంది.