CM Revanth Reddy: కెసిఆర్ జన్మదిన వేడుకలు: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. " 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కేసీఆర్ సొంతం. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా పని చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి.

Written By: Suresh, Updated On : February 17, 2024 2:31 pm
Follow us on

CM Revanth Reddy: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం 70వ వడి లోకి అడుగుపెట్టారు. సందర్భంగా భారత రాష్ట్ర సమితి నాయకులు తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వారు కూడా చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి భారత రాష్ట్ర సమితి నాయకులకు పంచారు. ఇక కెసిఆర్ ఏప్పటిలాగే కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గత ఏడాది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కానీ ఏడాది తిరిగేలోపే అధికారాన్ని కోల్పోవడంతో ఆయన ఈసారి వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో కెసిఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కెసిఆర్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని 70 కిలోల కేక్ కట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు కేకు ముక్క తినిపించారు. అనంతరం 1000 మంది ఆటో డ్రైవర్లకు లక్ష చొప్పున ప్రమాద బీమా చేయించారు. వారికి అందుకు సంబంధించిన బాండ్లను అందించారు. ఇక తెలంగాణ భవన్లో కేసీఆర్ జీవిత చరిత్రపై తానే ఒక చరిత్ర అనే పేరుతో డాక్యుమెంటరీ ప్రదర్శించారు.

ఇక అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ” 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కేసీఆర్ సొంతం. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా పని చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. శాసనసభను సజావుగా నడిపేందుకు బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా సహకరించాలి. 70 సంవత్సరాల వయసు ఉన్న కేసీఆర్ కు సంపూర్ణ ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి” అని రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా కెసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ఎక్స్ ద్వారా కూడా రేవంత్ రెడ్డి కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కెసిఆర్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి నాయకులు వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ, వికలాంగులకు దుస్తుల పంపిణీ, వృద్ధులకు అన్నదానం చేశారు. కొన్నిచోట్ల రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించారు. అయితే ఈసారి అధికారంలో లేకపోవడంతో తెలంగాణ భవన్ లో ఆశించినంత స్థాయిలో సందడి కనిపించలేదు. కొంతమంది కీలక నాయకులు కెసిఆర్ జన్మదిన వేడుకలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.