KCR – Chandrababu : చిన్నపిల్లలకు చందమామ కథలు చెప్పే తల్లులు అన్నం తినిపిస్తుంటారు. అలాగే తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి కేసీఆర్ పొలిటికల్ గా గెయిన్ అయ్యారు. అందునా చంద్రబాబును బూచీగా చూపించి కేసీఆర్ చేయని పన్నాగం లేదు. అదిగో చంద్రబాబు.. ఇదిగో చంద్రబాబు అంటూ తెలంగాణ ప్రజలను కెలికి మరీ విజయం దక్కించుకున్న సందర్భాలున్నాయి. అటువంటి కేసీఆర్ చంద్రబాబుకు తిట్టి తిట్టి విసిగి వేశారిపోయారో తెలియదు.. కానీ ఫస్ట్ టైమ్ చంద్రబాబును పాజిటివ్ కోణంలో చూశారు. భారీ బహిరంగ సభలో ఆయన్ను గుర్తుచేసుకున్నారు.
ఏపీలో జగన్ సర్కారు పాలనలో వైఫల్యాన్ని మూటగట్టుకుంది. సహజంగానే దయాది రాష్ట్రమైన తెలంగాణతో అందరూ పోల్చుకుంటారు. అందునా రాష్ట్ర విపక్ష నేత చంద్రబాబు ఊరుకుంటారా? కానీ తెలంగాణలో ఉన్నది కూడా తన ప్రత్యర్థి కేసీఆరే అయినా ఏపీలో జగన్ స్థాయిలో వైరం లేదు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష లేదు. అందుకే ఏపీలో పాలన అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకునేందుకు తెలంగాణలో పాలన బాగుంది అని కితాబివ్వాల్సి వచ్చింది. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనవచ్చని ఇటీవల చంద్రబాబు కామెంట్స్ చేశారు. అంత దారుణంగా జగన్ పాలిస్తున్నారని చెప్పే క్రమంలో ఈ వ్యాఖ్య చేశారు.
ఇప్పుడదే వ్యాఖ్యను కేసీఆర్ పాజిటివ్ గా తీసుకున్నారు. ఎప్పుడు చంద్రబాబు మాటలను వక్రీకరించి అర్ధం చప్పే గులాబీ బాస్ చంద్రబాబు మాటలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని కితాబిచ్చారు. అయితే మొన్నటికి మొన్న తన సొంత పత్రిక నమస్తే తెలంగాణాలో మాత్రం చంద్రబాబు ప్రశంస వెనుక కుట్ర కోణం దాగి ఉందన్న కథనం వండి వార్చారు. కానీ పటాన్ చెరువులో తాజాగా ఓ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పటాన్ చెరువులో ఎకరా భూమి రూ.30 కోట్లు ఉందని.. ఆ సొమ్ముతో ఏపీలో 100 ఎకరాలు కొనుగోలు చేయవచ్చని చెప్పారు. చంద్రబాబు కామెంట్స్ ను గుర్తుచేస్తూ.. ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మొత్తానికైతే కేసీఆర్ తన నిత్య ప్రత్యర్థిగా భావించే చంద్రబాబు రూట్లోకి వచ్చారన్న మాట.