KCR:‘తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏడాదికి మించి ఉండేటట్లు కనవడ్తలేదు. మాకు 111 మంది ఎమ్మెల్యే ఉన్నప్పుడే బీజేపీ కూల్చే ప్రయత్నం చేసింది. 65 మంది ఉన్న కాంగ్రెస్‌ను ఇడ్సిపెడ్తదా..’ నాలుగు రోజుల క్రితం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివీ. ఇవే వ్యాఖ్యలను తాజాగా టీవీ9కు ఇచ్చిన ఇంటర్యూవలో కేసీఆర్ పునరుద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్‌ను కూలుస్తుందని చెప్పారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో మొదలు పెట్టిందని, ఎన్నికల తర్వాత కర్నాటకలో కూలుస్తుందని, తర్వాత తెలంగాణకు వస్తుందని వెల్లడించారు.
బీఆర్‌ఎస్‌తోనూ టచ్‌లో..
ఇదిలా ఉంటే.. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యేలు, నాయకులతో మాట్లాడుతున్నారని కేసీఆర్ తెలిపారు. ఈ విషయం నాయకులే స్వయంగా తనతో చెప్పారన్నారు. 25 మంది ఎమ్మెల్యేల కాంగ్రెస్‌ను వీడి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ పూర్తికాలం కొనసాగే అవకాశం కనిపించడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలే తమ పార్టీ నేతలతో చెబుతున్నారని తెలిపారు. తాము 25 మందిమి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నామని, బీఆర్‌ఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చెబుతున్నారని వెల్లడించారు.
టచ్ వ్యాఖ్యల వెనుక..
కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల వేళ.. రివర్స్ మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ఒకవైపు రేంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీ మారారు. ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా దానికి కాదని కడియం కావ్య తన తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేదుకు, కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ తొలగించేందుకు కేసీఆర్ రివర్స్ గేమ్ ఆడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లేందకు ఎవరూ ఇష్టపడరని పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ను సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేయడంతోపాటు, బీఆర్‌ఎస్ క్యాడర్‌లో జోష్ తెచ్చేందుకే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు.