KCR: హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం రెండేళ్లుగా దేశంలో సంచలనంగా మారింది. ఈ స్కామ్‌తో దక్షిణాది, ముఖ్యంగా ఏపీ, తెలంగాణకు చెందిన లిక్కర్ వ్యాపారులు, రాజకీయ నాయకులే కీలకంగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు ఏడాదిగా జైల్లోనే ఉన్నారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఇదే కేసులో జైల్లో ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా మార్చి 16న ఈడీ అరెస్టు చేసింది. మరుసటిరోజు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించింది. అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. కానీ, దర్యాప్తు సంస్థలు కవిత బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రత్యేక కోర్టు, ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్లను న్యాయమూర్తులు తిరస్కరించారు. ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు కవిత తరఫు లాయర్లు. ఇదిలా ఉంటే కవిత అరెస్ట్ అయిన నాటి నుంచి కేసీఆర్ ఎన్నడూ అరెస్టును ఖండించలేదు. బాధపడలేదు. కనీసం ఢిల్లీ వెళ్లి కూతురును కలిసింది లేదు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో, తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయి ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్.. కూతురును మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
తొలిసారి స్పందించిన కేసీఆర్..
కవిత కేసును ఇప్పటి వరకు కేటీఆర్, హరీశ్‌రావే చూసుకుంటున్నారు. న్యాయవాదులతో మాట్లాడుతున్నారు. బెయిల్ పిటిషన్లపై సూచనలు చేస్తున్నారు. కవిత అరెస్టును కూడా వారు మొదటి రోజు నుంచీ ఖండిస్తున్నారు. మీడియా మందు కూడా కవిత కేసు విషయమై ఈ ఇద్దరు నేతలే మాట్లాడుతున్నారు. ఇంతకాలం కనీసం స్పందించని, ఖండించని కేసీఆర్ ఎట్టకేలకు కవిత అరెస్టుపై మాట్లాడారు. మంగళవారం బీఆర్‌ఎస్ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో కవిత అరెస్టు విషయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
కక్ష సాధింపు కోసమే అరెస్టు..
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేంద్రం తన కూతురు కవితను ఢిల్లీ కుంభకోణంలో ఇరికించిందని కేసీఆర్ ఆరోపించారు. కవిత అరెస్ట్ అయిననాటి నుంచి అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానని తెలిపారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే.. కన్న తండ్రిగా బాధ ఉండదా అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కొంటాం అని చెప్పారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం లేక కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆడుతున్న నాటకమే అరెస్టులు అన్నారు. బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని పేర్కొన్నారు. ఇక బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలు లేవన్నారు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడే తెలంగాణను సాధించామని అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
రేవంత్ సర్కార్ మొదలుపెడదాం..
ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏడు నెలల రేవంత్‌రెడ్డి పాలనపై అసెంబ్లీ వేదికగానే మాట్లాడదామన్నారు. ఏడు నెలలకే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ ముగిసిందని తెలిపారు. ఇక ప్రజాక్షేత్రంలో నిలదీద్దామని, వైఫల్యాలను ఎండగడదామని, హామీలు అమలు చేసేలా మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో అడుగు పెట్టనున్నారు. బుధవారం అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరింత రంజుగా జరగడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .