KCR Master Plan: నిజానికి తన మీద వస్తే విమర్శలను కెసిఆర్ ఏమాత్రం తట్టుకోలేరు. అప్పట్లో ఈటల రాజేందర్ గులాబీ పార్టీకి మేమే ఓనర్లమని అంటే.. తన్ని తరిమేశాడు కేసీఆర్. అంతకుముందు ఎమ్మెల్సీ రాములు నాయక్ ఇదే విషయం మీద మాట్లాడితే బయటికి గెంటేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కారు పార్టీ అధినేత బాధిత నాయకులు చాలామంది ఉంటారు. తనమీద, తన పార్టీ మీద ఎవరైనా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే కెసిఆర్ ఏమాత్రం క్షమించరు. పైగా వారికి రాజకీయ జీవితాన్ని లేకుండా చేస్తారు. ఇక ఆయన కుటుంబంలోనే ఇప్పుడు వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజులుగా గులాబీ సుప్రీమ్ కూతురు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. మీడియాలో అయితే కథనాల మీద కథనాలు ప్రసారం, ప్రచురితమవుతున్నాయి. మొత్తంగా తెలంగాణ జాగృతి అధినేత్రి సొంతంగా ఒక రాజకీయ కార్యాశాలను ఏర్పాటు చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి.. అయితే దీనిపై ఆమె ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఆమె తదుపరి అడుగులు మాత్రం బలంగానే ఉంటాయని.. అందువల్లే ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వాస్తవానికి తెలంగాణ జాగృతి అధినేత్రి కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహం గా ఉన్నారు. ఆమె దశ దిశ ఏమిటో తెలియక ఇబ్బంది పడుతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయంగా తన ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టారు. అయితే దీనికి గులాబీ క్యాడర్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇక అప్పటినుంచి ఆమె ఒక రకమైన భావనలకు వెళ్లిపోయారు. తనకంటూ ఒక క్షేత్రాన్ని సృష్టించుకోవాలని అనుకున్నారు. తనకు ఎదురవుతున్న సమస్యలు.. పార్టీలో ఉన్న ఇబ్బందులను పేర్కొంటూ ఏకంగా పార్టీ సుప్రీం కు లెటర్లు రాశారు. అవి కాస్త బయటికి రావడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. సాధారణంగా తన తండ్రికి రాసే లెటర్స్ అత్యంత గోప్యంగా ఉంటాయని.. ఆమె చెబుతున్నారు. అలాంటప్పుడు ఒక్కసారిగా బయటికి ఎందుకు వచ్చాయి? అనేది ఆమె ప్రధాన ప్రశ్నగా ఉంది. అయితే ఇవన్నీ కూడా గులాబీ సుప్రీం కు తెలిసి జరుగుతున్నాయా? ఈవ్యవహారాల వెనుక ఆయన ఉన్నారా అనే ప్రచారం కూడా తెలంగాణ రాజకీయాలలో జరుగుతోంది. ఎందుకంటే రాజకీయాలలో వ్యూహాలను, ప్రతి వ్యూహాలను, ప్రణాళికలను ఏకకాలంలో అమలు చేయగల నేర్పరితనం కారు పార్టీ అధినేత కు ఉంటుంది. వాస్తవానికి తెలంగాణ జాగృతి అధినేత్రి ఈ స్థాయిలో తిరుగుబాటు చేయడం వెనక ఆయన లేడనుకోవడానికి లేదని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..” కొడుకును కాదనుకో లేడు. అలాగని బిడ్డను దూరం చేసుకోలేడు. పార్టీ మీద పెత్తనం కొడుకు సాధించాడు. కొడుకు మాట వినని స్థాయికి ఎదిగిపోయాడు. అలాంటప్పుడు అతడికి కళ్లెం వేయాలంటే కూతుర్ని రంగంలోకి దింపాలి. ఏదో ఒక విషయంలో రచ్చ రచ్చ చేయాలి. ఆ తర్వాత ఇద్దరినీ తనఅదుపులో పెట్టుకోవాలి.. అదే కెసిఆర్ స్ట్రాటజీ అని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
“ఇద్దరినీ ఇలా ఇబ్బంది పెట్టి.. పార్టీలో లేని కల్లోలాన్ని సృష్టించే కంటే కూర్చోబెట్టుకొని మాట్లాడితే సరిపోతుంది కదా” అని కొంతమంది విశ్లేషకులు సరికొత్త వాదనను తీసుకొస్తున్నారు. “రెండు పవర్ హౌస్ లు ఒక దగ్గర కూర్చోవడం కష్టం. పైగా ఇద్దరూ ఆర్థికంగా బలమైన నేపథ్యాలను సృష్టించుకున్నారు. ఇలాంటి సమయంలో ఒకరి మాట మరొకరు వినడం దాదాపు అసాధ్యం. బయటికి ఏదో కనిపిస్తుంటారు.. నవ్వుతూ మాట్లాడుకుంటారు గాని.. అధికారం విషయంలో ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన మాట మాత్రం ఎందుకు వింటారని” భారత రాష్ట్ర సమితికి దగ్గరగా ఉండే వ్యక్తి ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారం గులాబీ సుప్రీంకో తెలియకుండా జరుగుతుంది అనుకోవడానికి లేదు. ఇదంతా ముందే ఊహించి.. ఆయన సైలెంట్ గా ఉండిపోయారని.. సమయం వచ్చినప్పుడు బరస్ట్ అవుతారనే వాదనలూ లేకపోలేదు. కాకపోతే పాతిక సంవత్సరాలుగా అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటున్న పార్టీలో ఒక్కసారిగా ఇలాంటి ఒడిదుడుకులు రావడం.. అది కూడా గులాబీ సుప్రీం కుటుంబం నుంచి రావడం.. సగటు తెలంగాణ వాదిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.