Khaleja Re Release Advance Bookings: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘ఖలేజా'(Khaleja Movie). 2010 వ సంవత్సరం లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఈ సినిమా ఫ్లాప్ నుండి కోలుకోవడానికి మహేష్ కి అప్పట్లో చాలా సమయమే పట్టింది. ఎందుకంటే అంత ఇష్టపడి చేసాడు ఈ చిత్రం. కానీ మహేష్ కి ఓవర్సీస్ మార్కెట్ పునాది పడింది ఈ చిత్రం తోనే. తెలుగు రాష్ట్రాల్లో అట్టర్ ఫ్లాప్ గా నిల్చిన ఈ చిత్రం నార్త్ అమెరికా లో మాత్రం ఏకంగా మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ రికార్డ్స్ ని కూడా దాటేసింది. ఇక టీవీ టెలికాస్ట్ లో అయితే ప్రేక్షకులు ఎగబడి చూసారు. కాలం గడిచే కొద్దీ ఈ సినిమా విలువ పెరిగింది.
మరొక్కసారి థియేటర్స్ లో విడుదల చేస్తే కచ్చితంగా ఈ చిత్రం వండర్స్ క్రియేట్ చేస్తుందని అభిమానులు బలంగా నమ్మారు. ఆ నమ్మకం తోనే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 30న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వారం రోజుల ముందే ప్రారంభించారు. బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే బుక్ మై షో యాప్ లో గంటకు 12 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. కచ్చితంగా ఈ సినిమా రీ రిలీజ్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టేస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ అది జరగడం లేదు. ఈ సినిమా ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లను అందుకోవడం అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. గబ్బర్ సింగ్ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
కానీ ‘ఖలేజా’ చిత్రానికి కేవలం మూడు కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది. హైదరాబాద్ సిటీ లో పలు టాప్ థియేటర్స్, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ముఖ్యమైన టౌన్స్ నుండి వచ్చిన గ్రాస్ మినహా, ఈ సినిమాకు పెద్దగా బుకింగ్స్ జరగలేదని అంటున్నారు. నార్త్ అమెరికా లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయం టాప్ 3 స్థానాన్ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి మొదటి రోజు + ప్రీమియర్ షోస్ కలిపి 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘ఖలేజా’ చిత్రానికి 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ ఒక సునామీ అని, మీడియం రేంజ్ హీరో కొత్త సినిమాకు ఎలాంటి ఓపెనింగ్ వస్తుందో అలాంటి ఓపెనింగ్ ఈ చిత్రానికి వచ్చిందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.