Kavitha And KCR: తనకు వ్యతిరేకంగా పనిచేసినా.. పార్టీ లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేసినా గులాబి దళపతి ఏమాత్రం ఉపేక్షించరు. మొహమాటం లేకుండా బయటికి పంపిస్తారు. ఆలే నరేంద్ర, విజయశాంతి, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఈటెల రాజేందర్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది. ఆలే నరేంద్ర, ఈటెల రాజేందర్ లాంటి వారిని కేసీఆర్ వదులుకున్నారంటే ఆయన ఎంత కఠినంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు స్వయంగా ఆయన కుమార్తె పార్టీ మీద విమర్శలు చేస్తోంది. పార్టీ నాయకులు అవినీతి పరులంటూ ఆరోపిస్తోంది. ఇలాంటప్పుడు కెసిఆర్ చర్యలు తీసుకుంటారా.. లేదా అలానే ఉపేక్షిస్తారా.. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పార్టీకి మరింత కష్టం.. ఒకవేళ చర్యలు తీసుకుంటే కుటుంబంలో విభేదాలు మరింత పెరుగుతాయి. ఎటు చూసుకున్నా సరే గులాబీ దళపతికి సంకటమైన పరిస్థితి. అయినప్పటికీ ఆయన కఠిన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
Also Read: ఈ వయసులో అంబటి రాంబాబు.. వైరల్ వీడియో
అదే ఖాయమా?
కవిత వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఇప్పటికే గులాబీ దళపతికి నివేదికలు అందినట్టు తెలుస్తోంది. అందువల్లే ఆమెను పార్టీ నుంచి బయటికి పంపించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి జాగృతి అధినేత్రిపై సస్పెన్షన్ వేటు విధిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకటి లేదా రెండు రోజుల్లో గులాబీ దళపతి నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని సమాచారం. సోమవారం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కీలకమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత.. కారు పార్టీ అధినేత ను గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి వంటి వారు కలిశారు.. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై చర్చించారు.. అయితే పార్టీలో తను ఉంటే లాభమా? నష్టమా? అనే చర్చ వారి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి ఆమెను తప్పించడమే మంచిదని మెజారిటీ నాయకులు గులాబీ దళపతికి సూచించినట్టు సమాచారం..”ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. చర్యలు తీసుకోకపోతే నష్టం తీవ్రంగా ఉంటుందని” కెసిఆర్ కు వారు చెప్పినట్టు సమాచారం. లోగడ తన పార్టీ అధినేత చుట్టు దయ్యాలు ఉన్నాయని జాగృతి అధినేత్రి వ్యాఖ్యానించారు.. అప్పట్లోనే ఆమెపై చర్యలు తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే ఎందుకనో కెసిఆర్ చూస్తూ ఉండిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని ఒక కీలక నేత అంటున్నారు.
సోషల్ మీడియాలో జాగృతి అధినేత్రిని అన్ ఫాలో కావాలని గులాబీ ఐటీ విభాగం నుంచి శిరీనులకు సంకేతాలు వెళ్లినట్టు తెలుస్తోంది.. దీంతో కవితను ఎక్స్ లో చాలామంది అన్ ఫాలో అయ్యారు. ఇక సామాజిక మాధ్యమాలలో ఆమెకు వ్యతిరేకమైన కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. వివిధ మాధ్యమాలలో గులాబీ పార్టీ తరఫున చర్చకు వెళ్లినవారు జాగృతి అధినేత్రి వ్యవహార శైలిని తీవ్రంగా విమర్శించారు. కొందరు నాయకులు ఒక అడుగు ముందుకేసి గత ఎన్నికల్లో ఓటమి ఆమె వల్లే జరిగిందని స్పష్టం చేశారు. ఇంకా కొందరైతే శాసనమండలి సభ్యురాలు, పార్టీలోని ఇతర పదవులకు రాజీనామా చేయాలని ఆమెను డిమాండ్ చేశారు. అంతేకాదు గులాబీ పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి జాగృతి అధినేత్రి పిఆర్ఓ ను తొలగించారు.