KCR: పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడు. ఆర్థిక రంగ పితామహుడు. అయినప్పటికీ ఆయనకు కంప్యూటర్ మీద అవగాహన లేదు.. అప్పట్లోనే మనదేశంలో కంప్యూటర్ విప్లవం మొదలైన నేపథ్యంలో.. కంప్యూటర్ గురించి నేర్చుకోవాలని.. దానిమీద పట్టు సాధించాలని పివి నరసింహారావు భావించారు. అంతటి వయసులోనూ ఆయన కంప్యూటర్ నేర్చుకున్నారు. కంప్యూటర్ పై పట్టు సాధించారు.. జిజ్ఞాస అనేది ఉంటే వయసు అనేది ప్రామాణికం కాదని పీవీ నరసింహారావు నిరూపించారు.
ఇప్పుడు ఇక తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సెల్ ఫోన్ పై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కెసిఆర్ ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా ఫోన్ వాడలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాలు కూడా తన అంతరంగికులతో మాట్లాడేందుకు సహాయకుల ఫోన్లు మాత్రమే ఉపయోగించేవారు. చివరికి కేటీఆర్, కవిత, హరీష్ రావు వంటి వారితో మాట్లాడేందుకు కూడా సహాయకుల ఫోన్లు మాత్రమే ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కావడం.. ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్నప్పటికీ వ్యవసాయ క్షేత్రానికే పరిమితం కావడంతో.. ఇప్పుడు ఆయన ఖాళీ సమయంలో ఫోన్ పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగించే విధానంపై కేటీఆర్ తనయుడు హిమాన్షురావు కేసీఆర్ కు అవగాహన కల్పిస్తున్నారు. కెసిఆర్ కు పుస్తక పఠనం మీద విపరీతమైన ఆసక్తి ఉంటుంది. గతంలో ఆయన 80 వేల పుస్తకాలు చదివానని ఓ సందర్భంలో చెప్పుకున్నారు. అయితే అప్పట్లో దీనిపై రకరకాలుగా చర్చలు జరిగాయి. కొంతమంది కేసీఆర్ తీరును వ్యతిరేకించగా.. మరి కొంతమంది కెసిఆర్ కు పుస్తకాలు చదవడం అంటే ఆ స్థాయిలో ఇష్టం ఉందని పేర్కొన్నారు..
స్మార్ట్ ఫోన్ వాడలేదు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కార్యాలయంలో ఫోన్లు.. వ్యక్తిగత సహాయకుల ఫోన్లు మాత్రమే కేసీఆర్ వాడేవారు. అది కూడా తన అంతరంగీకులతో మాట్లాడేందుకు మాత్రమే ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు కేసీఆర్ స్మార్ట్ ఫోన్ వాడకంపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. కెసిఆర్ మనవడు హిమాన్షు రావు ఆయనకు ఫోన్ వాడకం గురించి నేర్పిస్తున్నారు.. అమెరికాలో చదువుతున్న హిమాన్షురావు ఇటీవల తెలంగాణకు వచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మొక్కను నాటారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కేసీఆర్ తో గడుపుతున్నారు. ఇక ఇటీవల సామాజిక మాధ్యమా ఖాతాలను కెసిఆర్ ప్రారంభించారు.. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఆయన ఖాతాలను తెరిచారు. అయితే వాటిని ఆపరేట్ చేయాలంటే స్మార్ట్ ఫోన్ పై ఎంతో కొంత కమాండ్ ఉండాలి. అందువల్లే స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో కెసిఆర్ కు హిమాన్షురావు నేర్పిస్తున్నారు. ఇక ఇదే విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగు చూడడంతో.. రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ కు స్మార్ట్ ఫోన్ వాడకం గురించి తెలియదంటే ఆశ్చర్యమేనని.. మొత్తానికి ఇంతటి వయసులోనూ దాని గురించి తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్న తీరు గొప్పగా ఉందని కొంతమంది అంటుంటే.. ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ అసెంబ్లీకి వెళ్లడం లేదు.. వ్యవసాయ క్షేత్రానికి మాత్రమే పరిమితం అవుతున్నారు.. చివరికి ఖాళీ సమయంలో ఇలా ఫోన్ మీద కుస్తీ పడుతున్నారని మరికొంతమంది నొసలు చిట్లిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కెసిఆర్ స్మార్ట్ ఫోన్ వాడకం నేర్చుకోవడం కూడా చర్చకు దారి తీయడం నిజంగా విశేషమే.