https://oktelugu.com/

KCR: బాస్‌ బౌన్స్‌ బ్యాక్‌ అవుతారా.. కారును రేసులోకి తేగలరా?

నిన్నటి వరకు కేసీఆర్‌ దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు కేసీఆర్‌ను లెక్క చేయడం లేదు. ఇందులో ఉంటే భవిష్యత్‌ కష్టమని గ్రహించి తమ దారి తాము చూసుకుంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 6, 2024 / 12:57 PM IST

    KCR

    Follow us on

    KCR: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పదేళ్లు తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌ను ఈ పరిణామాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘోరంగా ఓడిపోయింది. ఎప్పటికీ తమదే అధికారం అని భావించిన గులాబీ పార్టీకి ఈ ఓటమి ఇప్పటికీ మింగుడు పడడం లేదు. ఓటమికి తమ వైఫల్యాలను ఒప్పుకోకుండా కాంగ్రెస్‌ తప్పుడు హామీలు కారణం అని చెప్పుకుంటున్నారు. ఇటీవల కేసీఆర్‌.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతే పార్టీ ఓటమికి కారణమని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే.. కామారెడ్డిలో కేసీఆర్‌ ఎందుకు ఓడినట్లు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపైనే వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ఇప్పటికీ గుర్తించడం లేదు. దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. తమ దారి తాము చూసుకుంటున్నారు.

    మనుగడే ప్రశ్నార్థకం..
    నిన్నటి వరకు కేసీఆర్‌ దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు కేసీఆర్‌ను లెక్క చేయడం లేదు. ఇందులో ఉంటే భవిష్యత్‌ కష్టమని గ్రహించి తమ దారి తాము చూసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పార్టీలో ఉండడానికి ఇష్టపడడం లేదు. ఓడిపోయినా అధినేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత చేస్తున్న అహంకార పూరిత మాటలు కిందిస్థాయి నేతలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు జంప్‌ అయ్యారు. ఎమ్మెల్యేలు కూడా వారిబాటలో పయనించాలని చూస్తున్నారు. దీంతో కేసీఆర్‌ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.

    లోక్‌సభ అభ్యర్థులు కరువు..
    మొన్నటి వరకు కారు ఓవర్‌లోడు అయినట్లు కనిపించింది. ఒక్కో అసెంబ్లీ, లోక్‌సభ స్థానానికి కనీసం పది మంది అభ్యర్థులు ఆ పార్టీ తరఫున పోటీకి పోటీపడ్డారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి ఇప్పుడు ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉండగా ముఖ్యమైన మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌.. విపక్షంలోకి వచ్చాకా పార్టీ నేతలను కాపాడుకోవడంలో విఫలమయ్యారు. కేటీఆర్‌ను కలవడమే ఒక ప్రహసనంలా భావించిన వారు, ఆయన దర్శనమే మహద్భాగ్యం అనుకున్నవారు. ఇప్పుడు లైట్‌ తీసుకుంటున్నారు. ఇక మరో కీలక నేత హరీశ్‌రావు సైతం సిద్దిపేటకే పరిమితమవుతున్నారు.

    కేసీఆర్‌ నిలబెడతారా..
    పార్టీని వీడేవారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. దీంతో గులాబీ బాస్‌ కేసీఆర్‌ రంగంలోకి దిగారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు మొదలు పెట్టారు. కనీసం వంద కోట్లు ఖర్చుపెట్టే నేతలను ఎంపిక చేస్తున్నారు. అయితే అంత ఖర్చు పెట్టేవారు తమ ప్రయోజనాలు నెరవేరాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో లేదు. ఎంపీ సీట్లు గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. దీంతో ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేయడాకి కూడా సంపన్నులు ఇష్టపడడం లేదు. టికెట్‌ ఇస్తామన్నా మొహం చాటేస్తున్నారు. సిట్టింగులలో ముగ్గురు వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి పోటీ చేయలేనని చెప్పారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. ఆయన బంధువులు కాంగ్రెస్‌ లో చేరిపోయారు. నల్గొండ, భువనగిరి, ఖమ్మం సీట్ల కోసం ఒక్క దరఖాస్తు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్‌ బాట పట్టడంతో అక్కడ నామా నాగేశ్వరరావుకే టిక్కెట్‌ ఖరారు చేశారు. కానీ ఆయన బీజేపీ తరçఫున పోటీ చేయాలని చూస్తున్నారు. వరంగల్‌లో ఇదే పరిస్థితి ఉంది. సికింద్రాబాద్‌ సీటు నుంచి తలసాని సాయిని బరిలో దించాలని పార్టీ భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే.. మరో 5 ఏళ్ల నాటికి పార్టీ నామరూపాల్లేకుండా పోయేలా ఉందనేది ఎక్కువ మంది భావన. ఈ పరిస్థితి నుంచి కేసీఆర్‌ కారును మళ్లీ రేసులోకి ఎలా తీసుకురాగలరో చూడాలి.