KCR On Kaleshwaram Commission Report: కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకంగా పనిచేసిన మురళీధర్, హరి రామ్ నాయక్ పై ఇటీవల ఏసీబీ దాడులు చేసింది. భారీగా ఆస్తులు సంపాదించారని.. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకంగా పనిచేసే భారీగా కూడ పెట్టారని అభియోగాలు మోపింది. వారిని జైళ్లకు కూడా పంపించింది. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేసిన ఇంజనీర్ల సంపాదనే ఇలా ఉంటే.. ఆ ఎత్తిపోతల పథకానికి కర్త కర్మ క్రియగా వ్యవహరించిన వారు ఏ స్థాయిలో సంపాదించి ఉంటారు మీ ఊహకే వదిలేస్తున్నామంటూ ఇటీవల కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించిన కొద్ది రోజులకే కాలేశ్వరం ఎత్తిపోతల పథకం లో చోటు చేసుకున్న అవకతవకలపై కమిషన్ కీలక నివేదిక బయటపెట్టింది. కాకపోతే కొన్ని మీడియా సంస్థలకు ఈ నివేదిక లీక్ అయింది.
Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..
కాలేశ్వరం కమిషన్ నివేదికపై సహజంగానే ఓ వర్గం మీడియా నెగిటివ్ వార్తలను ప్రసారం చేసింది. ప్రచురించింది. వాటిని గులాబీ పార్టీ అనుకూల మీడియా తీవ్రంగా ఖండించింది. ఇదంతా తెలంగాణపై జరుగుతున్న దాడిగా కలరింగ్ ఇచ్చింది.. అయితే ఈ స్థాయిలో కాలేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంటే గులాబీ బాస్ ఇంతవరకు స్పందించలేదు.. పైగా ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో చండీయాగం నిర్వహిస్తున్నారు. కాలేశ్వరం కమిషన్ నివేదికపై ఓ వర్గం మీడియా బీభత్సంగా కథనాలను ప్రచురిస్తే.. భారత రాష్ట్ర సమితి అధినేత కుమార్తె పట్టించుకోలేదు. పైగా ఆ కమిషన్ నివేదికపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కెసిఆర్ కమిషన్ విచారణకు హాజరైతే కల్వకుంట్ల కవిత తన నిరసన వ్యక్తం చేశారు. జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ఆందోళన నిర్వహించారు. కేటీఆర్ మాత్రం సోషల్ మీడియాలోనే తన నిరసన ప్రకటనలను పోస్ట్ చేస్తున్నారు.
అయితే తొలిసారి కాలేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కాలేశ్వరం గొప్పతనాన్ని తెలంగాణ ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. అంతేకాదు కాలేశ్వరం కమిషన్ అనేది కాంగ్రెస్ కమిషన్ అని కెసిఆర్ మండిపడ్డారు. కాలేశ్వరం పై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. అంతేకాదు త్వరలో అరెస్టులు కూడా జరుగుతాయని.. ఆ మాత్రం దానికి కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని.. తెలంగాణ ప్రజల భరోసా పార్టీకి ఉంటుందని.. కెసిఆర్ పేర్కొన్నారు.. మొత్తానికి ఇన్ని రోజులపాటు మౌనంగా ఉన్న గులాబీ బాస్.. కాలేశ్వరం కమిషన్ పై ఒక్కసారిగా పెదవి విప్పారు. కాలేశ్వరం పనికిరాదు అన్నవాడు ఒక అజ్ఞాని అని కేసిఆర్ వ్యాఖ్యానించారు. కాలేశ్వరం కమిషన్ నివేదికపై కెసిఆర్ తదుపరి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.