Team India WTC Points: ఉత్కంఠ మధ్య భారత్ ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించింది. హోరాహోరి ఆట తీరుతో ఏకపక్షంగా సాగుతుందనుకున్న అండర్సన్ టెండుల్కర్ సిరీస్ ను రసవత్తరంగా మార్చింది. అంతేకాదు టెస్ట్ సిరీస్ ను సమం చేసి ఆతిథ్య జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ముఖ్యంగా చివరిదైన ఐదవ టెస్టులో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. అటు బ్యాట్.. ఇటు బంతితో అదరగొట్టారు. తద్వారా పర్యటక జట్టు సత్తా చూపించారు.
Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..
ఆరు పరుగుల వ్యత్యాసంతో విజయం సాధించినప్పటికీ.. టీమిండియా కు ఈ గెలుపు బిగ్ రిలీఫ్. ఎందుకంటే స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయింది. ఇన్ని ప్రతికూల పరిణామాల మధ్య ఇంగ్లాండ్ గడ్డమీద టీమిండి అడుగు పెట్టింది. రోహిత్, విరాట్, అశ్విన్ లేకుండానే ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడింది. తొలి టెస్ట్ లో ఓడిపోయింది. రెండవ టెస్టులో గెలిచింది. మళ్లీ మూడో టెస్టులో ఓటమిపాలైంది. నాలుగో టెస్ట్ ను అద్భుతంగా డ్రా చేసుకుంది. చివరి టెస్టును చివరి వరకు పోరాడి.. ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయం నేపథ్యంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతానికి టీమిండియా రెండు విజయాలు, రెండు ఓటములతో 28 పాయింట్లు సాధించింది. టీమిండియా ఖాతాలో 46.67 విజయాల శాతం నమోదయింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఇటీవల వెస్టిండీస్ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆతిథ్య జట్టును వైట్ వాష్ కు గురి చేసింది. దీంతో డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో కంగారు జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. కంగారు జట్టు ఖాతాలో 36 పాయింట్లు ఉన్నాయి. కంగారు జట్టు నూరు శాతం విజయాలతో కొనసాగుతోంది.
డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో శ్రీలంక రెండవ స్థానంలో కొనసాగుతోంది. లంకేయుల ఖాతాలో ఒక విజయం.. ఒక డ్రా ఉన్నాయి. ప్రస్తుతం ఈ జట్టు 16 పాయింట్లు, 66.67 విజయాల శాతంతో కొనసాగుతోంది. ఇక బ్రిటిష్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ జట్టు ఖాతాలో 26 పాయింట్లు ఉన్నప్పటికీ.. విజయాల శాతం 43.33 గా ఉంది. ఇంగ్లాండ్ తర్వాత ఐదో స్థానంలో బంగ్లాదేశ్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. విజయాల శాతం 16.67 గా ఉంది. వెస్టిండీస్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. కివీస్, పాకిస్తాన్, సఫారీలు ఇంకా ఈ సీజన్లో టెస్టు సిరీస్ లను మొదలుపెట్టలేదు.