KCR Erravelli Farmhouse: అధికారంలో ఉన్నప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు చండీయాగాలు నిర్వహించేవారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యశ్యామల యాగం నిర్వహించారు. గతంలో ఆయన చండీ యాగం చేసినప్పుడు తిరుగులేకుండా పోయింది. 2014 కంటే 2018లో బంపర్ మెజారిటీ వచ్చింది. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం రాజ్య శ్యామల యాగం అంతగా ఆయనకు ప్రతిఫలాన్ని అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షానికి పరిమితమైంది. 2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.
Also Read: కవిత బీసీ దీక్ష.. దూరంగా బీఆర్ఎస్.. కెసిఆర్ కుటుంబం
పైగా ఇటీవల కాలంలో పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. తన కుమార్తె కవిత రూపంలో ధిక్కార స్వరం వినిపించడం మొదలుపెట్టింది.. పార్టీలో సుప్రీం లాగా ఉండే కేసీఆర్.. తనకు ఏమాత్రం వ్యతిరేకంగా స్వరం వినిపించినా తట్టుకోలేరు. ఇంత పెద్ద నాయకుడైనా సరే బయటికి పంపిస్తారు. ఆలే నరేంద్ర నుంచి మొదలుపెడితే ఈటెల రాజేందర్ వరకు అందరికీ ఇటువంటి దుస్థితే పట్టింది. కవిత తన కుమార్తె కావడంతో కెసిఆర్ వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఇటీవల కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి చోటుచేసుకున్న అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఘోష్ కమిటీ తన నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక కొన్ని మీడియా సంస్థలకు ముందే లీక్ కావడంతో.. నాడు ఆ ఎత్తిపోతల పథకంలో ఏం జరిగిందనేది బయటికి తెలిసింది. అటు కవిత వ్యవహారం.. ఇటు గొప్పగా చెప్పుకున్న ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవకతవకలు.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తన వ్యవసాయ క్షేత్రంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ చండీయాగం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.. అయితే అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ యాగానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం నుంచి మొదలు పెడితే బుధవారం వరకు ఈ యాగం జరుగుతుంది. కెసిఆర్ సతీమణి శోభ, సంతోష్ రావు, ఇంకా కొంతమంది అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ యాగంలో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ యాగం చేసినప్పుడు భారీ హంగామా ఉండేది. పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అక్కడ ప్రవేశం ఉండేది. పైగా వారంతా కూడా యాగంలో పాల్గొనేవారు. యాగంలో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతంలాగా భావించేవారు. ఇప్పుడు అధికారం లేదు.. పైగా పార్టీలో పరిస్థితి బాగోలేదు కాబట్టి పండితుల సూచన మేరకు కేసిఆర్ చండీయాగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: మంత్రిగారి ఫోన్ పోయింది.. చివరికి ఎక్కడ దొరికిందంటే..
చండీయాగం అనేది హిందువులు పాటించే క్రతువులో ముఖ్యమైనది. వెనుకటి కాలంలో పాలకులు తమ రాజ్యాన్ని విస్తరించడానికి, తమ పరిపాలనలో సుస్థిరతను సాధించడానికి చండీయాగాన్ని నిర్వహించేవారు. నాడు యాగంలో పాలుపంచుకున్న పండితులకు భారీగా నజరానాలు సమర్పించేవారు.. గతంలో కెసిఆర్ యాగాలు నిర్వహించినప్పుడు పండితులకు భారీగానే కానుకలు ఇచ్చేవారు.. ఇప్పుడు చండీయాగం నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి ఏ స్థాయిలో కానుకలు ఇస్తున్నారో తెలియదు. కల్వకుంట్ల కవిత వ్యవహార శైలి.. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు.. కాలేశ్వరం కమిషన్ విచారణ.. స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇన్ని సమస్యల మధ్య కెసిఆర్ నిర్వహిస్తున్న చండీయాగం చర్చనీయాంశంగా మారింది.