KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. నవంబర 30న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నాయి. అయితే ప్రతీ ఎన్నికల సమయంలో ఓ మెగా బహిరంగ సభ నిర్వహిస్తున్న కేసీఆర్ ఈసారి అలాంటి సభ లేకుండానే క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. ఇక సెంటిమెంట్‌గా భావించే వరంగల్ నుంచి కాకుండా ఈసారి హుస్నాబాద్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో కేసీఆర్ సెంటిమెంట్ వదిలేశారా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కేటీఆర్ మాత్రం తమకు అనుకూలమైన 6 సంఖ్య వస్తుందని ఈసారీ విజయం మాదే అని చెబుతున్నారు.
2018లో కొంగర్ కలాన్‌లో..
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ శివారులోని కొంగర్‌కలాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభతోనే పాజిటివ్ వేవ్ ప్రారంభమయింది. ఈసారి అలాంటి సభ ఏర్పాట్ల కోసం చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. ఎన్నిసార్లు డేట్లు ఫిక్స్ చేసినా ప్రయోజనం లేకపోయింది. అభ్యర్థుల ప్రకటన రోజున కేసీఆర్ వరంగల్‌లో అక్టోబర్ 16న ఊహించలేనంత భారీ సభ పెట్టబోతున్నామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ సభ గురించి మాట్లాడటం లేదు. వేరే షెడ్యూల్ ను ప్రకటించారు. వరంగల్‌లో కేసీఆర్ బహిరంగసభ పెట్టాలని మూడేళ్లుగా అనుకుంటున్నారు. హూజూరాబాద్ ఉపఎన్నికలకు ముందు సందర్భం లేకపోయినా ప్లీనరీ నిర్వహించారు. బహిరంగసభ పెట్టాలనుకున్నారు. కానీ వరంగల్ బహిరంగసభ ప్రదేశం ఉన్న రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అప్పట్లో వాయిదా వేశారు.
నోటిఫికేషన్ రాక..
ఇప్పుడు సభ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నా.. కేసీఆర్ ఆరోగ్యం సహకరించడం లేదు. మరో వైపు షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణలో ఒక్క విడతలోనే ఎన్నికలు పూర్తవుతాయి. అయితే తొలి విడతలో కాకుండా చివరి విడతలో ఎన్నికలు జరుగుతాయి. అందుకే బహిరంగసభ జోలికి పోకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.
15న మేనిఫెస్టో రిలీజ్..
కేసీఆర్ ఈనెల 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో సమావేశం అయి బీ–ఫారాలను అందిస్తారు. బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారు. ఈ మేనిఫెస్టో అదిరిపోయేలా ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అదే రోజు హుస్నాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. వరుసగా జిల్లాల పర్యటనలు చేపడతారు. అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాలు, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు, అక్టోబర్ 18న జడ్చర్ల స మేడ్చల్ సభల్లో పాల్గొంటారు. రోజుకు రెండు సభల్లో పాల్గొనేలా ప్రచార ప్రణాళిక సిద్ధంచేసుకుంటున్నారు. నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.