Harish Rao Father Passed Away: సిద్దిపేట ఎమ్మెల్యే , మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మంగళవారం తెల్లవారుజామున వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. తనీరు సత్యనారాయణ ది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి భర్త సత్యనారాయణ రావు. సత్యనారాయణ రావుకు ఇద్దరు కుమారులు సంతానం.
సత్యనారాయణ రావు మొదటి నుంచి కూడా నిరాడంబర జీవితాన్ని గడిపారు. హరీష్ రావును ఉన్నత చదువులు చదివించారు. హరీష్ రావు ఉన్నత ఉద్యోగం చేయాలని మొదటినుంచి సత్యనారాయణ రావు భావించారు. అయితే అనుకోకుండా హరీష్ రావు రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో సత్యనారాయణ రావుకు ఇది ఇష్టం లేకపోయినప్పటికీ.. ఆ తర్వాత కుమారుడు చేస్తున్న సామాజిక సేవలు చూసి మురిసిపోయారు సత్యనారాయణరావు. ఆ తర్వాత రాజకీయంగా హరీష్ రావు ఉన్నత స్థానానికి చేరుకునే విషయంలో సత్యనారాయణ రావు కీలకపాత్ర పోషించారు. తెర వెనుక సత్యనారాయణ రావు హరీష్ రావు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చేవారు.
రాజకీయంగా హరీష్ రావు కొన్ని సందర్భాలలో విమర్శలు.. ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సత్యనారాయణ రావు ధైర్యం చెప్పారు. హరీష్ రావు ఈ విషయాన్ని ఎప్పుడు బయటకు చెప్పుకోకపోయినప్పటికీ.. సిద్దిపేట ప్రాంత వాసులకు ఈ విషయం బాగా తెలుసు. హరీష్ రావు సిద్దిపేట ప్రాంత వాసిగా స్థిరపడిపోయినప్పటికీ.. తన స్వగ్రామంలో ప్రజలతో సంబంధాలను ఎప్పుడు కోల్పోలేదు. ఆ సంబంధాలను బలోపేతం చేసే విషయంలో ఎప్పటికప్పుడు సత్యనారాయణ రావు ముఖ్యపాత్ర పోషిస్తూ ఉండేవారు.
సత్యనారాయణ రావు తో కేసీఆర్ కి కూడా బలమైన అనుబంధం ఉండేది. కెసిఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో సత్యనారాయణరావు తన వంతు అండదండలు అందించారు. ఆయన రాజకీయంగా ఎదగడానికి కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు.. కుటుంబానికి అండగా ఉన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు.. కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నప్పుడు సత్యనారాయణరావు ధైర్యం చెప్పారు. కెసిఆర్ కుటుంబ సభ్యులకు అండగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో హరీష్ రావు ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రతి సందర్భంలోనూ సత్యనారాయణ రావు ఆందోళనకు గురయ్యేవారు. సిద్దిపేట నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు హరీష్ రావును తీసుకెళ్లిన ప్రతి పోలీస్ స్టేషన్ కు సత్యనారాయణ రావు వెళ్లారు. కొన్ని సందర్భాలలో పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను ఆయన బలంగా నొక్కి చెప్పారు. అందువల్లే హరీష్ రావు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా సరే తల్లిదండ్రులతో గడిపేవారు. ముఖ్యంగా తన తండ్రితో ఎక్కువ సమయం ఉండేవారు.
వృద్ధాప్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా సత్యనారాయణరావు హరీష్ రావుతో మాట్లాడిన తర్వాతే నిద్రకు ఉపక్రమించేవారు. కొద్దిరోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ రావు.. హరీష్ రావు వద్దనే ఉన్నారు. హరీష్ రావు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగించుకుని నేరుగా తన తండ్రి వద్దకు వెళ్లేవారు. చివరికి మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సత్యనారాయణరావు కన్నుమూశారు. సత్యనారాయణ రావు పార్థివ దేహాన్ని కోకాపేటలోని హరీష్ రావు స్వగృహంలో ఉంచారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర గులాబీ పార్టీ నాయకులు హరీష్ రావును పరామర్శించారు. సత్యనారాయణ రావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సత్యనారాయణ రావు కన్నుమూసిన నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా నెమరు వేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తన రాజకీయ ఎదుగుదలలో సత్యనారాయణ రావు కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. ఆయన మరణం తమ కుటుంబానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాలలో సత్యనారాయణ రావు ఫోటో పోస్ట్ చేసి నివాళులర్పించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.