Kavitha Padayatra : రాజకీయాలలో ముఖ్యంగా కుటుంబ పార్టీలలో ఒక వ్యక్తికి దక్కే గౌరవం మిగతావారికి దక్కదు. ఉదాహరణకు తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుంటే ఇప్పుడు ఆ రాష్ట్రానికి స్టాలిన్ ముఖ్యమంత్రి అయినప్పటికీ.. కరుణానిధికి ఉన్నంత గౌరవం స్టాలిన్ కు దక్కదు. అక్కడిదాకా ఎందుకు తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఉన్నప్పటికీ.. కెసిఆర్ స్థాయి ఆయనకు రాదు. కాకపోతే కేటీఆర్ తనను తాను భావి నాయకుడిగా ప్రమోట్ చేసుకుంటున్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రెండుసార్లు కూడా కేటీఆర్ అన్ని శాఖలలో పెత్తనం సాగించారు. గులాబీ పార్టీ లో కెసిఆర్ కుటుంబ సభ్యుల పెత్తనం ఉంటుంది కాబట్టి.. అందులో జరిగే అంతర్గత విషయాలు పెద్దగా బయటికి రాలేదు.
ఇటీవల కాలంలో గులాబీ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కెసిఆర్ కుమార్తె గులాబీ పార్టీ నాయకత్వాన్ని సవాల్ చేస్తున్నారు. గులాబీ పార్టీలో కీలకంగా ఉన్న హరీష్ రావు, సంతోష్ రావు పాత్రలను ఆమె తీవ్రంగా తప్పు పడుతున్నారు. వారు వ్యవహరించిన తీరును విమర్శిస్తున్నారు. తనకు పార్టీలో గుర్తింపు లభించకపోవడం వెనుక వారిద్దరే ప్రధాన కారణమని మండిపడుతున్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అనేక కుంభకోణాలలో వారిద్దరు ఉన్నారని.. వారిద్దరి వల్లే పార్టీలో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల గులాబీ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ విధించింది. దీంతో నొచ్చుకున్న కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు స్పీకర్ ఫార్మాట్లో తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పట్లో కొత్త పార్టీ పెడతారని వార్తలు వచ్చినప్పటికీ.. కవిత ఆ దిశగా అంతగా అడుగులు వేయలేదు. అయితే ఇప్పుడు ఆమె తెలంగాణ వ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే యాత్రకు సంబంధించిన కార్యాచరణ మొదలవుతుందని.. అని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ చివరి వారం నుంచి యాత్ర మొదలై ఫిబ్రవరి నెల వరకు కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే పార్టీ పేరు పెట్టకుండా కవిత యాత్ర నిర్వహిస్తే ఎంతవరకు లాభం జరుగుతుందనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. మరోవైపు యాత్రలో తన తండ్రి కేసిఆర్ ఫోటోలు లేకుండానే కవిత వ్యవహరిస్తారని.. తన తండ్రి ఫోటోకు బదులుగా జయశంకర్ సార్ ఫోటో ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. తెలంగాణ సిద్ధాంతకర్తగా.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తిగా జయశంకర్ సార్ కు పేరుంది. జయశంకర్ సార్ ను బతికి ఉన్నప్పుడు కెసిఆర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా అభివర్ణించేవారు. జీవితాంతం తెలంగాణ కోసమే బతికిన జయశంకర్ సార్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే కన్నుమూశారు. అయితే జయశంకర్ సార్ ఫోటోను పెట్టుకొని సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కేసీఆర్ మీద ఒక్క విమర్శ కూడా కవిత చేయలేదు. పైగా తర్వాత తండ్రిని తెలంగాణ బాపుగా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా కీర్తించారు. అయితే ఇప్పుడు కెసిఆర్ ఫోటో లేకుండానే కవిత యాత్ర చేయడం నిజంగానే తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. మరి యాత్రలో కవిత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాల్సి ఉంది.