Kavitha suspension : గులాబీ పార్టీ అధిష్టానం జాగృతి అధినేత్రిని సస్పెండ్ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అంతేకాదు పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా సరే ఇలాంటి చర్యలే ఉంటాయని అధిష్టానం స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే పార్టీలో కవిత ప్రస్థానం దాదాపుగా ముగిసినట్టే కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు కవిత మీద తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నారని.. అందువల్లే గులాబీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ రాజకీయాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత శాసనమండలి సభ్యురాలిగా కొనసాగుతారా.. లేదా ఆ పదవికి రాజీనామా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పదవికి రాజీనామా చేస్తే కవిత చరిష్మా మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే పదవిని పట్టుకొని వేలాడితే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.. ఇప్పటికే గులాబీ పార్టీ కార్యకర్తలు కవిత మీద యుద్ధాన్ని ప్రకటించారు. సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు చేస్తున్నారు. వివిధ మాధ్యమాలలో చర్చ వేదికలకు వెళ్లిన గులాబీ పార్టీ నాయకులు నిన్న సాయంత్రం నుంచి కవిత మీద విమర్శలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కవిత తీసుకునే పొలిటికల్ స్టాండ్ తెలంగాణ రాజకీయాలలో సంచలనం కానుంది. అయితే ఇప్పటికే ఆమె ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని.. బంజారాహిల్స్ లో తను నివాసం ఉండే ప్రాంతానికి దగ్గరలోనే మూడు అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారని.. దీపావళి రోజున పార్టీ పేరును ప్రకటించి.. కార్యకలాపాలు మొదలు పెడతారని తెలుస్తోంది.
ఇక సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తన ఇంట్లో కుటుంబ సభ్యుల మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన కవిత.. తనపై దుష్ప్రచారం చేస్తే మరిన్ని విషయాలు బయటపెడతానని హెచ్చరించారు. ఇప్పుడు పార్టీ అధిష్టానం ఆమెను సస్పెండ్ చేసింది కాబట్టి.. తన కుటుంబంలో జరిగిన వ్యవహారాలను.. ముఖ్యంగా తను పదేపదే చెబుతున్న అవినీతి మరకలు బయటపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆమె ఎప్పుడూ విలేకరుల సమావేశం నిర్వహించినప్పటికీ పరోక్షంగా ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆమె పార్టీ నుంచి బయటికి వచ్చారు కాబట్టి కచ్చితంగా కీలక విషయాలు బయటపెడతారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే గనుక జరిగితే గులాబీ పార్టీలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పుడు గులాబీ దళపతికి మరింత తలపోటు వస్తుందని.. అది పార్టీలో మరింత అగాధానికి దారి తీస్తుందని తెలుస్తోంది.