BC reservation credit For Kavitha: అధికార పార్టీ ఎన్నైనా చెబుతుంది. సంఖ్యాబలం అధికంగా ఉంటే శాసనసభలో ఎలాంటి బిల్లునైనా రూపొందిస్తుంది. కాకపోతే అది చట్టబద్ధమవుతుందా.. లేదా అనేది అధికార పార్టీకి అనవసరం. తనమీద క్వశ్చన్ మార్క్ ఉండకుండా చూసుకోవడం మాత్రమే అధికార పార్టీ పని. బాధ్యతగల ప్రతిపక్షం మాత్రం ఇలా కాదు.. ఆ బిల్లు ఆమోదం పొందుతుందా. ఆమోదం పొందుతే లాభమేంటి.. పొందకపోతే జరిగే నష్టం ఏంటి.. ఇలా అన్ని విషయాలను గమనించాలి. తనకున్న సమాచారంతోనే వ్యాఖ్యలు చేయాలి. అలాకాకుండా కీలకమైన బిల్లుల విషయంలో రాజకీయ కోణంలో మాట్లాడితే మాత్రం జనం ముందు అభాసు పాలు కాక తప్పదు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో అధికార కాంగ్రెస్ కాస్త దూకుడుగానే వెళ్ళింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా 42% రిజర్వేషన్ తీసుకొస్తామని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. కానీ ఈ విషయాన్ని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి చాలా సులువుగా తీసుకుంది. పైగా బీసీలను మోసం చేస్తున్నారని.. ఇటువంటి బిల్లులు చట్టబద్ధంగా ఆమోదం పొందవని శకుని శాపాలు పెట్టింది. తన కరపత్రికలో అడ్డగోలుగా వార్తలు రాసింది. సో కాల్డ్ పింకీ బీసీలతో శుష్క శాపనార్థాలు పెట్టించింది. కానీ ఇక్కడే జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన బీసీ బిల్లులను ఆమె స్వాగతించారు. అంతేకాదు వీటికి ఆమద ముద్ర వేయాలని గవర్నర్ ను కోరారు. దానికంటే ముందు ఆమె దీక్షకు కూడా దిగారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. బీసీ సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు. కవిత పోరాటానికి బీసీ నేత కృష్ణయ్య కూడా మద్దతు పలికారు. అక్కడితోనే కవిత ఆగలేదు.. జాగృతి ఆధ్వర్యంలో లీడర్ అనే కార్యక్రమంలో కూడా బీసీల రిజర్వేషన్ల విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో బీసీ నాయకులకు కవిత ఒక ఆశా దీపం లాగా కనిపించారు. వాస్తవానికి గులాబీ పార్టీ బాధ్యతగల ప్రతిపక్ష స్థానాన్ని పక్కనపెట్టి.. బీసీ బిల్లుల విషయంలో రాజకీయ కోణాన్ని మాత్రమే చూసింది. పైగా గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లులకు ఆమోదం తెలపరని ముందుగానే స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీని సైతం
బీసీల విషయంలో రాహుల్ గాంధీని సైతం కవిత తూర్పార పట్టారు. రాహుల్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. బీసీల రిజర్వేషన్ కోసం ఢిల్లీలో ఉద్యమిస్తుంటే.. కనీసం వారికి సంఘీభావం కూడా చెప్పడానికి రాహుల్ గాంధీ ముందుకు రాకపోవడాన్ని కవిత తీవ్రంగా తప్పు పట్టారు. మా బీసీ బిడ్డలు అంటే అంత చులకనా అంటూ విమర్శించారు. ఇది సహజంగానే కాంగ్రెస్ పార్టీలో కదలికను తీసుకొచ్చింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని కవిత విమర్శించడం.. సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రవర్తనను ఎండ కట్టడంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. అందువల్లే రేవంత్ ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. కవిత గనుక అలా ప్రశ్నించకపోతే ప్రభుత్వం కూడా చూస్తూ ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రేవంత్ ఢిల్లీలో మంత్రాంగం నడపడంతో గవర్నర్ ఆమోదముద్ర వేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న 42 శాతం రిజర్వేషన్ బీసీలకు సొంతం కానుంది. గవర్నర్ గెజిట్ రిలీజ్ చేయగానే చట్టబద్ధంగా రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. అప్పుడు బీసీలకు స్థానిక సంస్థల్లో ఎక్కువ శాతం స్థానాలు లభిస్తాయి. ఫలితంగా మున్సిపాలిటీ, నగర పాలకం, మేజర్ పంచాయతీలు, పంచాయతీలలో సింహభాగం బీసీలకే చోటు లభిస్తుంది.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినా.. అందులో సగం శాతం క్రెడిట్ కల్వకుంట్ల కవితకు దక్కుతుంది. ఎందుకంటే ఆమె చేసిన పోరాటం అటువంటిది. ఇప్పటికైనా కవిత చెప్పిన మాటలను గులాబీ పార్టీ శిరసా వహిస్తే కొంతలో కొంత మేలు జరుగుతుంది. ఇలానే గనుక వెళ్తే మాత్రం మరింత నష్టం జరుగుతుంది.
ట్వీట్ వేసి మొఖం చాటేసిన @RahulGandhi
మా బీసీలంటే అంత చులకనా మిస్టర్ ఎలక్షన్ గాంధీ
తెలంగాణ బీసీలను మరోసారి వంచించిన కాంగ్రెస్ అగ్రనేత
ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం బూటకపు హామీలు.. అబద్ధపు డిక్లరేషన్ లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఢిల్లీ నడివీధుల్లో మరోసారి బట్టబయలు…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 6, 2025