Kavitha : శీర్షిక చదివారు కదా. ఇప్పటికే మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ శీర్షికలో మేము పేర్కొన్నట్టుగా ఆ వ్యాఖ్యలను ఇంకొకరు చేసి గనుక ఉంటే పెద్ద లెక్కలో ఉండేవి కాదు. కానీ ఆ మాటలను మాట్లాడింది సాక్షాత్తు గులాబీ అధినేత కుమార్తె. ఇప్పుడంటే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ కావచ్చు గాని.. ఒక రకంగా తను పార్టీలో ఉన్నట్టే మాట్లాడుతోంది. తన పార్టీ అని చెబుతోంది. తన తెలంగాణ భవన్ అని గట్టిగా అంటున్నది. కేటీఆర్ ను రామన్న అని.. తన తండ్రిని దేవుడు అని సంబోధిస్తున్నది. కానీ ఇదే సమయంలో నీటిపారుదల శాఖ మాజీ మంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది. మొన్నటికంటే కూడా బుధవారం నాటి విలేకరు సమావేశంలో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది జాగృతి అధినేత్రి. రాజ్యసభ మాజీ సభ్యుడి పై కూడా కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది.
పార్టీలో అంతర్గత కలహాలు ప్రారంభం కావడానికి నీటిపారుదల శాఖ మాజీ మంత్రి కారణమని కవిత కుండబద్దలు కొట్టారు. అంతేకాదు రాజ్యసభ మాజీ సభ్యుడు కూడా దీనికి కారణమని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళేటప్పుడు పార్టీలో ముఖ్య నాయకుడు రేవంత్ వెళ్తున్న విమానంలో వెళ్లారని.. అప్పుడు ఆయనకు సరెండర్ అయిపోయారని.. కాళ్లు కూడా పట్టుకున్నారని కవిత సంచలన ఆరోపణ చేశారు. ఆ తర్వాతే పార్టీలో అంతర్గత విషయాలు బయటకి పొక్కడం మొదలైందని కవిత స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించి తనను విజయవంతంగా బయటికి వెళ్ళగొట్టారని.. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించారని.. ఆ తర్వాత రేపు రామన్నకు.. మరుసటి రోజు కేసీఆర్ కు ఇదే దుస్థితి ఎదురవుతుందని కవిత జోష్యం చెప్పారు. పార్టీని మొత్తం హైజాక్ చేసుకుంటారని.. అందులో అనుమానమే లేదని కవిత పేర్కొన్నారు.
అవినీతికి.. అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి రేవంత్ శరణు జొచ్చారని.. రేవంత్ కాళ్లు పట్టుకున్నారని.. అందువల్లే పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని.. వ్యక్తిగతంగా వేధింపులకు గురి చేస్తున్నారని.. దీని అంతటికి ఆ ఇద్దరు కారణమని కవిత పేర్కొన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. వారిద్దరు బయటికి వెళ్తేనే పార్టీ బాగుపడుతుందని వ్యాఖ్యానించారు. మొన్నటి విలేకరుల సమావేశంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన కవిత ఇప్పుడేమో ఏకంగా రేవంత్ కాళ్లు పట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినట్టుగా ఆడుతున్నారని.. అందువల్లే పార్టీ పరిస్థితి ఇలా మారిపోయిందని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై గులాబీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.