Kavitha shocking revelations: రోగి కోరుకున్నది.. డాక్టర్ రాసింది ఒకటే మందు అన్నట్టుగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కోరుకున్న పని.. జాగృతి అధినేత్రి అనుకున్న పని ఒకటే కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాగృతి అధినేత్రి సంచలన విషయాలను వెల్లడించారు. నీటిపారుదల శాఖ మాజీమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న పాల వ్యాపారం.. ఇతర వ్యాపారాలు.. రంగనాయక సాగర్ దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రం.. గుర్రాల విడిది కేంద్రం.. ఇంకా రకరకాల వ్యాపారాల గురించి సాక్షాలతో సహా కవిత వెల్లడించారు. గురుకులాలకు “నీటిపారుదల శాఖ మాజీ మంత్రి సతీమణి ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ నుంచి పాలు సరఫరా అవుతున్నాయని.. వాటిలో నాణ్యత లేదని ఇటీవల ఆరోపణలు రావడంతో మీడియాలో వార్తలు వచ్చాయని.. రెండు రోజులకే అవి ఆగిపోయాయని కవిత పేర్కొన్నారు. రంగనాయక సాగర్ వ్యవసాయ క్షేత్రం విషయం కూడా మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దానిపై కూడా రెండు రోజులకే వార్తలు ఆగిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. ఇవన్నీ కూడా మీకు చెబుతున్నాను.. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారనేది నాకు తెలియదని” తెలంగాణ జాగృతి అధినేత్రి పేర్కొన్నారు.
ఇక రాజ్యసభ మాజీ సభ్యుడు మోకిలా ప్రాంతంలో 750 కోట్ల వ్యయంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాపార భాగస్వామిగా బ్లూ పిన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడ భారీ ఎత్తున నివాస సముదాయాలు నిర్మిస్తున్నారు. ఒక రాజ్యసభ మాజీ సభ్యుడికి ఈ స్థాయిలో డబ్బులు ఎలా వచ్చాయి.. అప్పట్లో హరితహారం అని పెడితే ఆయన నిర్వహిస్తున్న గ్రీన్ చాలెంజ్ కార్యక్రమానికి అనుకూలంగా ప్రభుత్వ జీవోలు విడుదలయ్యేవి. సినిమా సెలబ్రిటీలను తీసుకువచ్చి ఆయన మొక్కలు నాటించేవారు. ఆ ఫోటోలతో తన కార్యక్రమానికి పబ్లిసిటీ చేయించుకునేవారు. ఆ తర్వాత కొన్ని అడవులను అభివృద్ధి చేస్తానని ప్రభుత్వం నుంచి రాయల్టీ తీసుకునేవారు . నేరెళ్ల ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా ఈయన చేతిలోనే నడిచింది. పోలీసులను ఉసిగొలిపి దళితులపై దాడులు చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన భాగోతాలు కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వయంగా నేనే చెప్తున్నాను. ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారో నాకైతే సంబంధం లేదు” అని కవిత పేర్కొన్నారు.
విలేకరుల సమావేశంలో కవిత నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చాలావరకు సాక్షాలతో బయటపెట్టారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చెబుతున్నట్టు కవిత వెల్లడించారు. ఈ నేపథ్యంలో దొరికిందే ఆయుధంగా రేవంత్ వీరిపై చర్యలు తీసుకుంటారా.. లేదా నిశ్శబ్దంగా ఉంటారా.. ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది.