Kavitha new political journey: హడావిడిగా నిన్న కవితపై గులాబీ పార్టీ సస్పెన్షన్ వేటు విధించింది. సాధారణంగా ఒక కీలక నాయకురాలిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కచ్చితంగా పార్టీ అధ్యక్షుడు.. కార్యనిర్వాహక అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ అవి లేకుండా సోమా భరత్ కుమార్, తక్కెళ్ళపల్లి రవీందర్రావు సంతకాలు మాత్రమే అందులో ఉన్నాయి. వారిద్దరు కూడా పార్టీకి కార్యదర్శులుగా ఉన్నారు. తనను సస్పెండ్ చేస్తూ లేఖ విడుదల చేసిన భారత రాష్ట్ర సమితి పై కవిత ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు. ఇది చెల్లదంటూ పేర్కొనవచ్చు. కానీ అలాంటి పని కవిత చేయలేదు. పైగా భారత రాష్ట్ర సమితి అధిష్టానం దారి తప్పినప్పటికీ.. తను మాత్రం పకడ్బందీ విధానాలతోనే బయటకు వచ్చారు. పక్కాగా రాజీనామా చేశారు. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. ఆ లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు. శాసనమండలి సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్ లోనే రాజీనామా లేఖను పంపించారు.
వాస్తవానికి పార్టీకి, శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేస్తారని ముందుగా ఊహించిందే. అయితే ఇందులో అసలైన సంచలనం ఏంటంటే.. పార్టీ పేరును కవిత ప్రకటించకపోవడం.. బుధవారం నాటి విలేకరుల సమావేశంలో కవిత తన రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తారని.. తన రాజకీయ కార్య క్షేత్రాన్ని వివరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలా కాకుండా కవిత పార్టీ విషయంలో.. తన రాజకీయ విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. కాకపోతే జాగృతి ఆధ్వర్యంలో ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తారని కార్యకర్తలు చెబుతున్నారు. భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసినప్పటికీ.. శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ చివర్లో జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ ఆమె నినాదాలు చేశారు.
ఈ ప్రకారం చూసుకుంటే ఆమె పార్టీ ఏర్పాటు విషయంలో కాస్త నిదానాన్ని పాటించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు కొన్ని విషయాలలో వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తుందని సమాచారం. కొద్దిరోజుల పాటు నిశ్శబ్దంగా ఉండి.. జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత దీపావళి నాటికి రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారని ఆమె అనుచరులు అంటున్నారు. ఒకవేళ అదే గనుక నిజమైతే.. ఈలోపు పార్టీ అధిష్టానం ఆమె మీద ఉన్న ఆగ్రహాన్ని తగ్గించుకుంటే.. మళ్లీ భారత రాష్ట్ర సమితి కండువాను కవిత కప్పుకుంటారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పార్టీ పేరును ప్రకటించకుండా.. తన రాజకీయ క్షేత్రాన్ని వెల్లడించకుండా కవిత సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. అయితే ఇది ఎక్కడ వరకు వెళ్తుంది.. ఎంతవరకు దారి తీస్తుంది.. అనే ప్రశ్నలకు మాత్రం త్వరలోనే సమాధానం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.