Kavitha new party name: కవిత చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సొంత కుటుంబ సభ్యురాలే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో గులాబీ పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలో అర్థం కాక తర్జన భర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేసిన జాగృతి అధినేత్రి మీద చర్యలు తీసుకోవడానికి గులాబీ పార్టీ పెద్ద సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పార్టీ లైన్ ను ధిక్కరించి వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు.. జాగృతి అధి నాయకురాలి మీద కూడా అదే తరహా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.. ఒకవేళ ఆమె కనక బయటికి వస్తే ఏం చేస్తారు.. ఎటువంటి రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతున్నాయి.
గులాబీ పార్టీ శాసనమండలి సభ్యురాలు కొత్త పార్టీ ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమని తెలంగాణ రాజకీయాలలో చర్చి జరుగుతోంది. బీసీల సమస్యలే పరిష్కారంగా.. బీసీల అభ్యున్నతి లక్ష్యంగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో దీపావళికి పార్టీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం పార్టీ కార్యాలయాన్ని బంజర హిల్స్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. కవిత ఉంటున్న నివాసం పక్కనే మూడు అంతస్తుల భవనాన్ని కిరాయికి తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరు ఖరారు కాకపోతే టిఆర్ఎస్ అనే పేరుని కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జనాలలో ఈ పేరుకు విపరీతమైన ప్రాచుర్యం ఉండడం.. తెలంగాణ రాష్ట్ర సమితిని గులాబీ అధినేత భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసేందుకు కవిత సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఆమె పార్టీ ఏర్పాటు.. ఇతర అంశాల మీద బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా వెళ్ళిన తర్వాత కవిత మానసికంగా సిద్ధమైనట్టు.. పార్టీ ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తన తండ్రి చుట్టూ ఉన్న దయ్యాలు వీడిపోవని తెలిసిన తర్వాత గులాబీ దళపతి కూతురు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. సోషల్ మీడియాను బలోపేతం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కొంతమందితో ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే తన తండ్రి ఏర్పాటు చేసిన పార్టీతో సమానంగా అభివృద్ధి చెందడానికి కవిత అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమెను తెలంగాణ సమాజం ఆమోదిస్తుందా.. దగ్గరికి తీసుకుంటుంది అనేది.. చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.