Kavitha: బీఆర్‌ఎస్ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేసి ఆ పార్టీలో తుపాన్ సృష్టించారు. కల్వకుంట్ల కవిత. స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ కూతురు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఈఆర్ సోదరి. కానీ, పార్టీలో తన గుర్తింపు కోసం కొన్నాళ్లుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. పార్టీని దెబ్బతీసేలా మాట్లాడుతూ వచ్చారు. ఇటీవలే బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు, సంతోష్‌కుమార్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో అధిష్టానం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు కవిత మరో సంచలన నిర్ణయం తీసుకుని బీఆర్‌ఎస్ కంట్లో నలుసులా మారారు. బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్, ఆ తర్వాత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తన సామాజిక, సాంస్కృతిక సంస్థ అయిన తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ స్థాపన ద్వారా తెలంగాణ రాజకీయాల్లో తన సొంత గుర్తింపును నెలకొల్పాలని కవిత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఆమెకు ఒక కీలక వేదికగా మారనున్నాయి.
బీఆర్‌ఎస్‌పై రాజకీయ యుద్ధం..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నడుస్తుండగా, కవిత ఎంట్రీ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. కవిత స్వతంత్రంగా లేదా కొత్త పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగితే, బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకులో చీలిక తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికలు హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే అవకాశంగా కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే, ఆమె గెలిచే అవకాశాలు తక్కువైనప్పటికీ, బీఆర్‌ఎస్ ఓట్లను ఆకర్షించడం ద్వారా పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉంది. అయితే కవిత తన సస్పెన్షన్, పార్టీలో తనను సైడ్‌లైన్ చేసిన ఆరోపణలను ఉపయోగించి బాధితురాలిగా సానుభూతి పొందేందుకు ప్రయత్నించవచ్చు. ఈ పరిస్థితి బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారవచ్చు.
సర్వేలతో క్షేత్రస్థాయిపై ఆరా..
కవిత జూబ్లీహిల్స్‌లో తన ప్రభావాన్ని అంచనా వేసేందుకు సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సర్వేలు ఆమె ఓటు బ్యాంకు, స్థానిక రాజకీయ పరిస్థితులు, బీఆర్‌ఎస్‌పై ప్రభావితం చేసే అంశాలను తెలుసుకోవాలని చూస్తున్నారని సమాచారం. కవిత తన తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చి, బహుజన రాష్ట్ర సమితి (టీబీఆర్‌ఎస్) వంటి పేరుతో కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ఎన్నికలు ఆమె రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షగా మారనున్నాయి.
కాంగ్రెస్, బీజేపీకి అవకాశం..
కవిత ఎంట్రీతో బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు బలహీనపడితే, కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఉప ఎన్నిక ఒక అవకాశంగా మారవచ్చు. కాంగ్రెస్ ఈ ఎన్నికను హైదరాబాద్‌లో తమ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగించుకోవాలని చూస్తోంది. నవీన్ యాదవ్, రంజిత్ రెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. బీజేపీ కూడా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో భాగమైన ఈ నియోజకవర్గంలో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కవిత పోటీ వల్ల బీఆర్‌ఎస్ ఓట్లు చీలితే, ఈ రెండు పార్టీలకు లాభం చేకూరే అవకాశం ఉంది.