Jubilee Hills By Election: తెలంగాణలో( Telangana) తెలుగుదేశం పార్టీ మరోసారి క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభావవంతమైన పార్టీగా ఎదిగింది. సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది. రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఉనికి కోల్పోయింది. అయినా సరే అక్కడ క్యాడర్ కొనసాగుతోంది. ప్రధానంగా సెటిలర్స్ ఉన్న గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో ఇప్పటికీ టిడిపి జెండాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి గ్రేటర్లో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఏడాది చివర్లో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తో పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రకటన రావచ్చు అని అంచనా వేస్తున్నారు. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలు పోటీకి సిద్ధపడుతున్నాయి. కానీ అందరి చూపు తెలుగుదేశం పార్టీ పైనే ఉంది.
* ఏపీ మూలాలు అధికం..
2014లో మాగంటి గోపీనాథ్( maaganti Gopinath ) తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తెలంగాణలో మారిన రాజకీయ ముఖచిత్రంతో ఆయన కెసిఆర్ వెంట అడుగులు వేస్తారు. జూబ్లీహిల్స్ అనేది సెటిలర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం. అయితే మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అప్పట్లో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఎన్నికలు రావడంతో టిడిపి బరిలో దిగలేదు. అయితే ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేసే ఛాన్స్ లేదు. అందుకే ఆ పార్టీ మద్దతు కూడగట్టేందుకు అటు బిఆర్ఎస్, ఇటు బిజెపి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
* గోపీనాథ్ టిడిపి సన్నిహిత నేత..
ఎమ్మెల్యే గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో.. వచ్చిన ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బిఆర్ఎస్( BRS) భావిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఇక్కడ బీసీ నేత నవీన్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కు టిడిపి తో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే టిడిపి ఓటర్లు నవీన్ యాదవ్ పై మొగ్గు చూపుతారని రేవంత్ అంచనా వేస్తున్నారు. మరోవైపు టిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను బరిలో దించేందుకు కేసిఆర్ నిర్ణయించారు. 2014లో మాగంటి గోపీనాథ్ టిడిపి ద్వారా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు సెటిలర్స్ అధికంగా ఉన్నారు. వీరంతా టిడిపి సానుభూతిపరులే. మాగంటి కుటుంబం ఇప్పటికీ చంద్రబాబు కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. అందుకే గోపీనాథ్ మృతి చెందినప్పుడు మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పరామర్శకు వచ్చారు. మొన్న ఆ మధ్య జూబ్లీహిల్స్ కు సంబంధించి మాట్లాడేందుకు కేటీఆర్ నారా లోకేష్ ను కలిసినట్టు కామెంట్స్ వినిపించాయి. స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలు చేశారు.
* బిజెపి నమ్మకం అదే..
ఇంకోవైపు ఏపీలో తెలుగుదేశం పార్టీతో కీలక భాగస్వామిగా ఉంది భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో సైతం టిడిపి కీలక భాగస్వామి. సుదీర్ఘకాలం పొత్తు ద్వారా ముందుకు వెళ్లాలని ఆ రెండు పార్టీలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. అందుకే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం బిజెపి తప్పకుండా టిడిపి సహకారం కోరే అవకాశం ఉంది. బిజెపి సైతం టిడిపి మూలాలు ఉన్న నేతకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ముద్ర చాటుకునే అవకాశం వచ్చింది. మరి టిడిపి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.