Kalvakuntla Kavitha Yatra: భారత రాష్ట్ర సమితి బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. నేరుగా ప్రజల వద్దే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. త్వరలోనే ఆమె జాగృతి జనం బాట పేరుతో రాజకీయ యాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ ప్రయాణాన్ని.. తన లక్ష్యాలను కవిత మరోసారి వివరించారు. ఈసారి కూడా తనదైన శైలిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అగ్ర నాయకులు కేటీఆర్, హరీష్ రావు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. గులాబీ పార్టీ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. కవిత కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రజల వద్దే తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.
జాగృతి జనం బాటకు సంబంధించి కవిత సంచలన విషయాలను వెల్లడించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకోవడానికి తాను ఈ యాత్ర చేపడుతున్నట్టు కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయిందని.. ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారని.. ప్రభుత్వ పెద్దలు మాత్రం రైజింగ్ తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ ఏ విధంగా నష్టపోతుందో చెప్పడానికి తాను ఈ యాత్ర చేస్తున్నట్టు కవిత పేర్కొన్నారు. రాజకీయంగా కూడా తన స్థానాన్ని తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిరం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నట్టు కవిత వెల్లడించారు. యాత్రకు సంబంధించి విధివిధానాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తానని కవిత పేర్కొన్నారు.
యాత్ర చేస్తున్న నేపథ్యంలో కవిత కెసిఆర్ ఫోటోలు లేకుండానే ప్రజల ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొంతమంది విలేకరులు కవిత ఎదుట ప్రస్తావించారు. దానికి ఆమె తనదైన శైలిలో సమాధానం చెప్పింది.” కెసిఆర్ లాంటి వ్యక్తి కడుపున పుట్టడం జన్మజన్మల అదృష్టం. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అటువంటి భాగ్యం కలగదు. నాకు అది దక్కింది. కాకపోతే ఇప్పుడు రాజకీయంగా దారులు వేరయ్యాయి. అలాంటప్పుడు కేసీఆర్ పేరు చెప్పడం అనేది నైతికంగా సరైనది కాదు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకునే దుస్థితి నాకు లేదు. నేను వేరే దారి చూసుకుంటున్న. గతంలో జాగృతి సంస్థను ఏర్పాటు చేసినప్పుడు నేను కేసీఆర్ ఫోటో పెట్టలేదు. జయశంకర్ సార్ ఫోటో మాత్రమే వాడుకున్నాం. రాజకీయంగా ఆలోచనలు వేరే విధంగా ఉన్నప్పుడు కెసిఆర్ ను స్మరించడం సరైన విధానం కాదని” కవిత క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల కవిత జాగృతి ఆధ్వర్యంలో లీడర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత జాగృతి సంస్థను బలోపేతం చేయడానికి కృషి చేశారు. జిల్లాలలో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. వారి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడిక జిల్లాల బాటను మొదలుపెట్టారు కవిత. ఈ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ బలమైన రాజకీయ పునాదులు వేసుకునేందుకు ఆమె అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తన యాత్రకు సంబంధించి శ్రేణులకు కవిత దిశా నిర్దేశం చేశారు. అడుగులుగా ఆరోపణలు చేయకుండా సెటిల్డ్ గా మాట్లాడుతున్నారు కవిత. అందువల్లే మీడియా కూడా ఆమె వార్తలకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది.