Free Bus Service: ఉచితం.. ఈ పదం వినగానే భారతీయ పేద, మధ్య తరగతి జనాలకు ఎక్కడలేని ఉత్సహం వస్తుంది. ఫ్రీగా వస్తుందంటే అది మనకు అవసరమా.. కాదా అనే విషయం కూడా ఆలోచించరు. చితంగా వస్తుంది కాబట్టి తీసుకుందాం అని ఆలోచించేవారే ఎక్కువ. ఇక నేడు ఉచితం అయితే.. రేపటి పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కూడా చేయరు. దీంతో ఎన్నికల వేళ.. అధికారం కోసం ఉచితంగా హామీలు ఇచ్చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడానికి తంటాలు పడుతున్నారు. ఇందుకు తాజాగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాహరణగా నిలిచింది.
ఏం జరిగిందంటే..
ఐదు గ్యారంటీల పేరుతో కర్ణాటకలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉచిత హామీలకు ఆశపడి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ను గద్దెనెక్కించారు. అధికారంలోకి రాగానే ఉచిత హామీలు అమలు చేయడం ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. ఉచితాల కారణంగా ప్రభుత్వంపై భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దానిని తగ్గించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీలు పెంపుపై దృష్టిపెట్టింది. జూన్‌లో పెట్రోల్, డీజిల్‌పై పన్ను 4 శాతం పెంచింది. తాజాగా త్వరలో ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ(కేఎస్‌ఆర్టీసీ) చైర్మన్ ఎస్‌ఆర్ శ్రీనివాస్ తెలిపారు.
20 శాతం మేర భారం..
కర్ణాకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. ఈ పథకంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. అయితే సంస్థకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఏడాది తిరిగే సరికి సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో నిధులు సమీకరణపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ధరలు పెంచనిదే.. బస్సులు నడపలేమని చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. చార్జీల పెంపు కూడా 15 నుంచి 20 శాతం ఉండాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. సీఎం సిద్ధరామయ్య తీసుకునే నిర్ణయంపై చార్జీలు ఏమేరకు పెరుగుతాయనేది ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. అయితే చార్జీల పెంపు మాత్రం తప్పదని మరోసారి స్పష్టం చేశారు.
ఉద్యోగుల పేరు చెప్పి..
ఇక కర్నాటక ఆర్టీసీ చైర్మన్ ఈ పెంపునకు కొత్త కారణం చెప్పారు. రాష్ట్రంలో 2019 నుంచి బస్ చార్జీలు పెంచలేదని తెలిపారు. ఇక ఉద్యోగుల వేతనాలు కూడా పెంచలేదని వెల్లడించారు. 2020 నుంచి ఉద్యోగులు వేతనాలు పెంచాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే చార్జీలు పెంచాల్సి వస్తోందని తెలిపారు. గడిచిన మూడు నెలల్లో సంస్థక రూ.295 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు.
ఉచిత ప్రయాణంతోనే..
కర్నాటక ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీలో ఉచిత ప్రయానం కారణంగానే లాభాల్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో కూరుకుపోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఉచిత ప్రయాణం ఎత్తివేస్తే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతాయి. ఈ నేపథ్యంలో ఉచితాన్ని కొనసాగిస్తూనే ఆదాయం సమకూర్చుకునేందుకు చార్జీలను భారీగా పెంచాలని ఆ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. అంటే.. మహిళల ఉచిత ప్రయాణ భారాన్ని కూడా పురుషులే మోయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే పన్నుల మోత..
ఇదిలా ఉంటే.. ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గ్యారంటీలను అమలు చేస్తూ.. వాటితో జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రజలపై పన్నుల భారం మోపుతోంది. వివిధ రకాల పన్నులు, ఇతరత్రా రూపాల్లో సామాన్యుడి జేబును గుల్ల చేస్తోంది. ఇప్పటికే గైడెన్స్ వ్యాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైమ్ ట్యాక్స్ పెంచింది. గత నెలలో పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను దాదాపు 4 శాతం చొప్పున పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.3, లీటర్ డీజిల్ ధర రూ.3.02 మేర పెరిగింది. మరోవైపు పాల ధరలను కూడా లీటర్, అర లీటర్ ప్యాకెట్లపై రూ.2 చొప్పున కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) పెంచింది. ఇక ఇప్పుడు ఆర్టీసీ చార్జీలపై పడింది.
గ్యారంటీలకు కత్తెర..
ఒకవైపు ధరలు భారీగా పెంచుతున్న కాంగ్రెస్ సర్కార్.. ఇంకోవైపు అమలు చేస్తున్న గ్యారంటీలకు కత్తెర పెట్టే పనిలో పడింది. ఆంక్షలు, కోతలతో గ్యారంటీలను కుదించేస్తోంది. ఫ్రీ కరెంటు అని ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీశారు. మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న ‘గృహలక్ష్మి’ స్కీమ్‌కు కొత్త ఆంక్షలు జోడించారని, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్‌లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చారని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’, పేదలకు ఉచిత బియ్యమన్న ‘అన్నభాగ్య’ ఇలా ప్రతీ స్కీమ్‌లోనూ కోతలు విధిస్తున్నారు.
నేడు కర్ణాటక.. రేపు తెలంగాణ..
తెలంగాణలో కూడా ఆరు నెలల క్రితం ఆరు గ్యారంటీలు, ఉచిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే ధరలను భారీగా పెంచిన అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్నే.. త్వరలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇస్తే.. అదే బాటలో తెలంగాణలో ఆరు గ్యారంటీలతో అధికారం చేపట్టింది. హామీల విషయంలో కర్ణాటక కాంగ్రెస్‌ను అనుసరించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజలపై∙పన్నుల భారం మోపడంలోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వానే అనుసరిస్తుందంటున్నారు నిపుణులు.
కేటీఆర్ ట్వీట్..
ఇక కర్ణాటకాలో ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలకు ఉచితాలపై ఉన్న భ్రమలను ఒక్క ట్వీట్‌తో పటాపంచలు చేశారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ‘ఉచితాలకు మోసపోతే రేపు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు, దీనికి ఉదాహరణగా కర్నాటకలో ఆర్టీసీ బస్ చార్జీల పెంపు’ అని ట్వీట్ చేశారు. కర్నాటకలో ఉచిత ప్రయాణాల కారణంగా ప్రభుత్వంపై ఏటా రూ.295 కోట్ల భారం పడుతోందన్నారు. దానిని తగ్గించుకోవడానికి కొత్త ఎత్తుగడ వేసిందని తెలిపారు. అందులో భాగంగానే చార్జీలు పెంచుతోందని పేర్కొన్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి పురుషులపై వడ్డింపు అన్నమాట అని తెలిపారు.