Karimnagar contested game: రాజకీయాల్లో గెలిచిన నేతలకే పదవి, పలుకుబడి, గౌరవం ఉంటాయి. పనులు చేయించేది, ప్రజల తరఫున సమావేశాల్లో ప్రశ్నించేది కూడా పదవిలో ఉన్నవారే. మెజారిటీ సీట్లు గెలిస్తే అధికారపక్షం అంటారు.. తక్కువ సీట్లు వస్తే ప్రతిపక్షంలో కూర్చుంటారు. ప్రజాస్వామ్యంలో ఇది కామన్. కానీ కరీంనగర్‌లో ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా పెత్తనం చెలాయించే వ్యూహం రూపొదిస్తున్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులతో సమానంగా ’కంటెస్టెడ్ ఎమ్మెల్యే’, ’కంటెస్టెడ్ కార్పొరేటర్’ గా స్వయంగా ప్రకటించుకుంటున్నారు. ఈమేరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాహనాలకు స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు. విజిటింగ్ కార్డులు ఇస్తున్నారు. ఈ వింత పరిణామం స్థానిక పాలనలో గందరగోళాన్ని సృష్టిస్తుంది.
పీఠం దక్కించుకున్న బీజేపీ..
కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ కార్పొరేటర్ స్థానాలు గెలిచి పీఠం దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. అధికార కాంగ్రెస్ పీఠం కోసం సర్వశక్తులు ఒడ్డినా ప్రజలు కమలం వైపే మొగ్గుచూపారు. ఫలితాల తర్వాత కూడా బీఆర్‌ఎస్, స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుని పీఠం కోసం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ప్రయత్నాలు చేశారు. కానీ బీఆర్‌ఎస్ హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెస్ ఆశలు ఆవిరయ్యాయ. ఇక ఓడిపోయిన నాయకులు పార్టీలోని నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘కంటెస్టెడ్’ పేరుతో సొంతంగా లేని పదవులు సృష్టించుకుని అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కొత్త ట్రెండ్‌గా మారింది.
హోర్డింగ్‌లు, వాహనాలకు స్టిక్కర్లు..
ఈమేరకు పెద్ద ఫ్లెక్సీలపై ’కంటెస్టెడ్’ ఎమ్మెల్యే/కార్పొరేటర్’ అని పేరుపెట్టి రోడ్లపై ఏర్పాటు. మానకొండూరు, కరీంనగర్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరు కార్లపై స్టికర్లు అంటించుకుని అధికారిక స్థాయిలో తిరుగుతున్నారు. మరికొందరు కలెక్టర్లు, ఎమ్మెల్యేల కార్యాలయాల్లో విజిటింగ్ కార్డులతో హాజరవుతుఆన్నరు. స్థానిక సమస్యల సమావేశాల్లో ప్రధాన అతిథులుగా పాల్గొంటున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థులు ఎక్కువగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు.
అధికార దుర్వినియోగమే..
కంటెస్టెడ్ ట్రెండ్‌ను గెలిచిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికార దుర్వినియోగంగా పేర్కొంటున్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పార్టీ స్థాయిలో డిసిప్లినరీ చర్యలు, పబ్లిక్ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ప్రజల్లో గందరగోళం పెరిగి, నిజ అధికారులను గుర్తించడం కష్టమవుతోంది.