Karimnagar Cable Bridge: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 183 కోట్లు ఖర్చుపెట్టారు. మానేరు నది మీద శోభాయమానంగా నిర్మించారు. హైదరాబాదులో దుర్గం చెరువు తర్వాత ఆ స్థాయిలో ఇక్కడ తీగల వంతెన నిర్మించారు. కరీంనగర్ నగరానికి మణి హారంగా ఉంటుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెప్పారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే ఈ తీగల వంతెన కరీంనగర్ నగరానికి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. మానేరు నది నుంచి రాకపోకలకు సరికొత్త వారధిగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆ వంతెన రూపురేఖలు మారిపోయాయి. స్థూలంగా చెప్పాలంటే 183 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన తీగల వంతెన ఒక్కసారిగా తన ఆకృతిని కోల్పోయింది.
ఆ వంతెన నిర్మాణంలో సరైన నిబంధనలు పాటించలేదని.. నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారని.. రోడ్డు నిర్మాణంలో కూడా అడ్డగోలుగా వ్యవహరించాలని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపించింది. అంతే కాదు తీగల వంతెన మీదుగా నిర్మించిన రోడ్డు అధ్వానంగా ఉందని.. ఎత్తు పల్లాలు ఉన్నచోట ఎక్స్ కవేటర్ సహాయంతో తవ్వించింది. మరమ్మతులు పూర్తి చేయకపోవడంతో ఆ వంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాదు పోలీసులు బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో ఆ వంతెన మీదుగా రాకపోకలు సాగడం లేదు. దీంతో ఆ రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది..
రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికులు వంతెనను మరో విధంగా ఉపయోగించుకుంటున్నారు. మానేరు నదిలో దుస్తులను ఉతికి.. వాటిని ఆరబెట్టుకోవడానికి తీగల వంతెన మీద ఉన్న రోడ్డును ఉపయోగించుకుంటున్నారు. వాస్తవానికి ఈ రోడ్డు మీదుగా రాకపోకలు గతంలో నిత్యం సాగుతూ ఉండేవి. ఈ రోడ్డు అత్యంత బిజీగా ఉండేది. తీగల వంతెన కూడా ఉండడంతో పర్యాటక ప్రాంతంగా వెలుగొందేది. కానీ ఇప్పుడు తీగల వంతెన ఆ శోభను కోల్పోయింది. దుస్తులు ఆర వేసుకునేందుకు మాత్రమే పనికివస్తోంది. రోడ్డు బాగోలేదు కాబట్టి.. రాకపోకలు నిలిపివేశామని పోలీసులు చెబుతున్నారు. ఆ రోడ్డుకు సంబంధించిన పనులు ఎప్పుడు పూర్తవుతాయో ప్రభుత్వ పెద్దలు చెప్పడం లేదు. దీంతో ఆ వంతెన దుస్తులు ఆరబెట్టడానికి పనికివస్తోంది.. దీనిపై గులాబీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు