HomeతెలంగాణKaleshwaram Project: కాళేశ్వరం కథకంచికేనా? లక్ష కోట్లు గోదావరిలో వేసినట్లేనా?

Kaleshwaram Project: కాళేశ్వరం కథకంచికేనా? లక్ష కోట్లు గోదావరిలో వేసినట్లేనా?

Kaleshwaram Project: కాళేశ్వరం.. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌గా గత కేసీఆర్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. ఈ ప్రాజెక్టుతో కొత్తగా లక్ష ఎకరాలు సాగులోకి వచ్చినట్లు చెప్పుకుంది. కాళేశ్వరం నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలమైందని కేసీఆర్‌తోపాటు, నాటి మంత్రులు ఊదరగొట్టారు. సుమారు రూ.లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభించిన మూడేళ్లకే కుంగినోయింది. బుంగలు పడ్డాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి కాళేశ్వరం కుంగుబాటు కూడా ఓ కారణం.

Also Read: తాగినోళ్లకు తాగినంత.. ఈ ఎండాకాలంలో పండుగ చేసుకోండి..

కాళేశ్వరం ఎంతో గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం హయాంలోనే కీలకమైన లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. అన్నారం బ్యారేజీ పిల్లర్ల వద్ద బుంగలు పడ్డాయి. నిర్మాణ లోపాలు బయటపడ్డాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్, రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించి రాజకీయంగా దీర్ఘకాల ప్రయోజనాలు అందిస్తుందని భావించింది. అయితే, 2023 ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లు బయటపడటంతో ఈ ప్రాజెక్ట్‌ బీఆర్‌ఎస్‌కు భారంగా మారింది. ఇప్పుడు, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (NDSA) సమర్పించిన నివేదిక మరో షాక్‌ ఇచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పనికిరావని, వీటిని ఉపయోగిస్తే ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని తేల్చింది.

NDSA నివేదిక..
14 నెలల సుదీర్ఘ అధ్యయనం, పలు పరీక్షల తర్వాత NDSA సమర్పించిన నివేదిక ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మూడు బ్యారేజీల డిజైన్, నిర్మాణంలో తీవ్ర లోపాలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీకెంట్‌ పైల్స్‌ కూలిపోవడంతో పాటు, బ్యారేజీల ఎగువ, దిగువ భాగాల్లో రంధ్రాలు ఏర్పడినట్లు గుర్తించారు. ఈ బ్యారేజీలను యథావిధిగా ఉపయోగించకుండా, పూర్తిగా రీడిజైన్‌ చేసి నిర్మించాలని NDSA స్పష్టం చేసింది. ఈ లోపాల కారణంగా బ్యారేజీలు శాశ్వత నష్టానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

భూసార పరీక్షలు, నిబంధనల ఉల్లంఘన
NDSA నివేదికలో మరో కీలక అంశం బయటపడింది. బ్యారేజీల నిర్మాణానికి ముందు అవసరమైన భూసార పరీక్షలు నిర్వహించలేదు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సిఫారసు చేసిన స్థలాలకు బదులు, ఇతర ప్రాంతాలకు మార్చడం జరిగింది, ఇది నిర్మాణ స్థిరత్వాన్ని దెబ్బతీసింది. అంతేకాదు, జాతీయ ఆనకట్టల భద్రత చట్టం–2021 ప్రకారం, వర్షాకాలానికి ముందు బ్యారేజీల భద్రతా తనిఖీలు చేయాల్సిన నిబంధనను కూడా పాటించలేదని నివేదిక వెల్లడించింది.

రాజకీయ, న్యాయపరమైన పరిణామాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌కు NDSA నివేదిక కీలక ఆధారంగా మారనుంది. ఈ నివేదిక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేసీఆర్‌లను ప్రశ్నల వరుసకు గురిచేసే అవకాశం ఉంది. రాజకీయంగా, ఈ నివేదిక బీఆర్‌ఎస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారి, ప్రతిపక్ష పార్టీలకు రాజకీయ ఆయుధంగా మారవచ్చు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ లోపాలను హైలైట్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.

రైతులపై ప్రభావం..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రైతులకు సాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషించాలని భావించారు, కానీ ఈ బ్యారేజీలు పనికిరాకపోవడం రైతాంగానికి నష్టం కలిగిస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు బ్యారేజీల రీడిజైన్, పునర్నిర్మాణంపై దృష్టి సారించాల్సి ఉంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జరిగిన అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది.

 

Also Read: మోడీ సార్.. పాకిస్తాన్ ను కేసీఆర్ కొడతాడట.. వీడియో వైరల్

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version