Revanth Reddy Allegations: రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి హోదాలో తన సొంత జిల్లాలో పర్యటించిన ఆయన ఈసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. కెసిఆర్ చేసిన దోపిడి గురించి.. వెనకేసుకున్న పైసల గురించి.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చేసిన అన్యాయం గురించి స్పష్టంగా చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలోనే కరువు జిల్లాగా పేరుపొందింది ఉమ్మడి పాలమూరు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కూడా ఇదే. ఈ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాకు కేసిఆర్ ఏమి చేయలేదని.. పాలమూరు జిల్లాలో మరింత వెనక్కి నెట్టారని రేవంత్ ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు రేవంత్ రెడ్డి. రెండవ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను ఆయన దగ్గరుండి పరిశీలించారు. కరివేన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ కీలక విషయాలను బయటపెట్టారు.
“ఉమ్మడి పాలమూరు వెనుకబడిపోయింది. ముఖ్యంగా ఈ జిల్లాలో గత ప్రభుత్వం ఏ ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు. జూరాల మినహా మిగతా అన్ని ప్రాజెక్టులు వెనుకబడి ఉన్నాయి. కనీసం భూసేకరణ కూడా చేయలేదు.. పంపులు, లిఫ్ట్ పనుల్లో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది. ఈ అవినీతి వ్యతిరేకంగా అప్పట్లో నాగార్జున రెడ్డి సంవత్సరాల తరబడి పోరాటం చేశారు.. నేను నా జిల్లాను బాగు చేసుకోవాలని పరితపిస్తున్నాను. వారేమో నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. పనులు ఎలా పూర్తి చేయాలో నాకు తెలుసు అని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పట్టించుకోలేదని రేవంత్ ఆరోపించారు. ఒకవేళ ఈ పథకం గనుక పూర్తయితే 26 లక్షల ఎకరాలకు నీరు వచ్చేది. 27 వేల కోట్లు ఖర్చు చేసి పంపులు, లిఫ్ట్ పనులు పూర్తి చేశారు. ఈ పనుల వల్ల కేసీఆర్ దండిగా తన ఖజానా మొత్తాన్ని నింపుకున్నారు. కమిషనర్ల పేరుతో వేల కోట్లు మళ్లించుకున్నారు. ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తి చేయలేదు.. ప్రాజెక్టులు పూర్తయినట్టు కేసీఆర్ మాత్రం చెబుతున్నారని రేవంత్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు 8 వేల కోట్లు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఇంకా 4000 ఎకరాల భూమి అవసరం. భూసేకరణ జరపకుండా రిజర్వాయర్లలో నీళ్ళు నింపడం దాదాపు అసాధ్యం. పైగా ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా అప్పుడు కూడా పుట్టడం లేదు. పాలమూరు రంగారెడ్డి పథకానికి 55 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే ఇప్పటివరకు 27 వేల కోట్లు మాత్రమే ఖర్చయింది. 50% నిధులు కూడా ఖర్చు చేయకుండా, 90% పనులు పూర్తి చేయడం సాధ్యం కాదు.. పైగా తనపై కోపంతో మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ను కెసిఆర్ పక్కన పెట్టారని రేవంత్ ఆరోపించారు.
