Jubilee Hills Survey Congress vs BRS: తెలంగాణలో త్వరలో మరో ఉప ఎన్నిక రాబోతోంది. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గతేడాది కూడా కంటోన్‌మెంట్‌కు ఉప ఎన్నిక జరిగింది. ఇది కూడా బీఆర్‌ఎస్ స్థానమే. కానీ, ఉప ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ చేస్తోంది. నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మూడ్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ పాపులేషన్ సంస్థ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ సర్వే ప్రకారం, ప్రజల అభిప్రాయాలు, పాలక పార్టీపై సంతృప్తి, అభ్యర్థులు ఎవరే ఆసక్తిని చాలా మంది కనబర్చారు.
Also Read:ఎమ్మెల్సీలు కోదండరాం, అలీ ఖాన్ కు సుప్రీంకోర్టు షాక్.. రేవంత్ ఏం చేస్తారు?
రేవంత్ పాలనపై అసంతృప్తి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత 18 నెలలుగా అధికారంలో ఉంది. సర్వే ప్రకారం, రేవంత్ రెడ్డి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి విషయంలో 28.40% మంది మాత్రమే మద్దతు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మహిళలకు రూ.2500, విద్యార్థులకు స్కూటీ, తులం బంగారం, రూ.4 వేల పెన్షన్, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 2 లక్షల ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు అమలులో లోపాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. ‘అప్పులు‘ అనే సాకుతో ఈ హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లో విద్యుత్ కోతలు, తాగునీటి కొరత, రోడ్ల గుంతలు, వీధి లైట్ల సమస్యలు, పారిశుద్ధ్య లోపాలు ప్రజల అసంతృప్తికి కారణాలుగా నిలుస్తున్నాయి.
ఎమ్మెల్యే అభ్యర్థులపై ఆసక్తి..
సర్వే ప్రకారం, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా శ్రీమతి మాగంటి సునీతమ్మకు 46.60% మంది మద్దతు తెలిపారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యురాలిగా సునీతమ్మకు సానుభూతి ఓట్లు లభించే అవకాశం ఉంది. గోపీనాథ్ గతంలో ఈ నియోజకవర్గంలో మూడుసార్లు విజయం సాధించడం, స్థానికంగా ఆయనకు ఉన్న పట్టు ఈ అనుకూలతకు కారణం.
కాంగ్రెస్‌లో అభ్యర్థుల మధ్య పోటీ..
కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, నవీన్‌యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ సర్వేలో అజారుద్దీన్‌కు 22.72%, నవీన్ యాదవ్‌కు 15.90% మద్దతు లభించింది. అజారుద్దీన్‌కు ముస్లిం సామాజిక వర్గం నుంచి బలమైన మద్దతు ఉంది, అయితే నవీన్ యాదవ్ కుల, మత, పార్టీలకు అతీతంగా స్థానికంగా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. కాంగ్రెస్‌లోఇద్దరి మధ్య టికెట్ కోసం పోటీ ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కీలకం కానుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 4.54% మద్దతు ఉండగా, 12.5% మంది తమ అభిప్రాయం వెల్లడించకపోవడం గమనార్హం.
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వైసిపి.. స్పృహ లేని టిడిపి సోషల్ మీడియా!
బీఆర్‌ఎస్‌కు మెజారిటీ మద్దతు..
సర్వేలో 65.90% మంది బీఆర్‌ఎస్ మేనిఫెస్టో హామీలను అమలు చేయగల సామర్థ్యం కలిగి ఉందని భావించారు. కాంగ్రెస్‌కు 17.04%, బీజేపీకి 3.40% మద్దతు లభించగా, 13.65% మంది ఈ అంశంపై నిర్ణయానికి రాలేదు. బీఆర్‌ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసిన నేపథ్యం ఈ అభిప్రాయానికి బలం చేకూర్చింది. కాంగ్రెస్ హామీలపై ప్రజల్లో నమ్మకం తగ్గడం ఈ ఫలితాల్లో స్పష్టమవుతోంది. ఇక పార్టీల పరంగా చూస్తే బీఆర్‌ఎస్‌కు 44.91%, కాంగ్రెస్‌కు 37.33% మద్దతు ఉంది. ఇతర పార్టీలకు 0.55%, నోటాకు 0.85% మద్దతు తెలిపారు. కానీ 13.02% మంది తమ అభిప్రాయాన్ని తెలపలేదు. బీఆర్‌ఎస్‌కు సానుభూతి ఓట్లు, గత పాలన ఘనతలు అనుకూల కారకాలుగా ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ అధికారంలో ఉండటం, స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకునే అవకాశం దానికి బలం చేకూర్చుతోంది. ప్రజల్లో ఒక వర్గం ‘అధికార పార్టీకి ఓటు వేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి‘ అనే భావనలో ఉంది.

