JrNTR YCP Fans: ఏదైనా గోరంత జరిగితే.. కొండంత ప్రచారం జరిగే రోజులు ఇవి. అంతలా పెరిగిపోయింది ప్రసార మాధ్యమాల హవా. సోషల్ మీడియా( social media) వచ్చాక భావ స్వేచ్ఛ పేరిట చాలామంది రెచ్చిపోతున్నారు. అవి వ్యవస్థలకు, వ్యక్తులకు, వ్యక్తుల సమూహాలకు ఇబ్బందులు తెస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు సోషల్ మీడియా వరమో.. శాపమో అర్థం కావడం లేదు. ఈ సోషల్ మీడియా ప్రచారానికి చాలామంది బాధితులు ఉన్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై సోషల్ మీడియా వేదికగా తెగ ప్రచారం నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ సినిమాకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అన్న టాక్ నడుస్తోంది. అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఈ విషయంలో టిడిపి సోషల్ మీడియా సైతం ప్రచారానికి దిగుతుండడం బాధాకరం.
Also Read: ఎన్టీఆర్ అంటే గిట్టని వైఎస్ఆర్.. ఓన్ చేసుకుంటున్న జగన్
తరచూ వివాదాలు..
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైనప్పుడు, ఏదైనా ఘటనలు జరిగినప్పుడు.. తారక్ చుట్టూ ఇటువంటి వివాదాలు, ప్రచారాలు రావడం సర్వసాధారణంగా మారింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తున్నారు. సినీ కెరీర్ మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఇతర అంశాలపై మాట్లాడితే అది సంచలనం అవుతుందని తెలిసి.. తన కంట్రోల్లోనే ఉంటున్నారు. అయితే దానిని కూడా తప్పుపడుతూ టిడిపి సోషల్ మీడియా యాక్టివిస్టులు లేనిపోని పోస్టులు పెడుతుండడం ఇబ్బందికరంగా మారుతోంది. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి కానీ.. ఇతరులకు కానీ వచ్చే ప్రయోజనం ఉండదు. కానీ పార్టీకి.. జూనియర్ ఎన్టీఆర్ మధ్య అగాధం అయితే మాత్రం పెంచుతున్నారు.
తారక్ లో పరిణితి..
జూనియర్ ఎన్టీఆర్ లో( Junior NTR) పరిణితి కనిపిస్తోంది. ముఖ్యంగా తనను తాను సంస్కరించుకుంటున్నారు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే ఆ సమయంలోనే కెరీర్ పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. రెండు పడవల మీద ప్రయాణం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చారు. సినిమాల్లో సాధించాల్సింది చాలా ఉందని గుర్తు చేసుకుని.. వీలైనంతవరకూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చివరకు తన సోదరి సుహాసిని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినా బాహాటంగా మద్దతు తెలపలేదు. తద్వారా రాజకీయ నీడ తనపై పడకూడదని బలంగా భావిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. అందుకే మాటలను పొదుపుగా వాడుతున్నారు. లేనిపోని వేదికల వద్ద కనిపించడం లేదు కూడా.
Also Read: ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకునే పనిలో జగన్.. పెద్ద ప్లానే వేశారే..!
వైసిపి ప్లాన్ అదే..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) సోషల్ మీడియా ఒకటి గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు బలంగా మద్దతు ఇస్తున్నారు. అందుకే సినీ రంగంలో ఏ చిన్న అవకాశం కూడా విడిచిపెట్టకూడదు అన్నది వైసిపి ప్లాన్. అందులో భాగంగానే అల్లు అర్జున్ ను పావుగా వాడుకుంది. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎప్పటినుంచో రాజకీయం చేస్తోంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ద్వారా తారక్ అభిమానులను వలవేసింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ శ్రేణులు పరకాయ ప్రవేశం చేశారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం సోషల్ మీడియా ఎంత వెనక్కి తగ్గితే అంత మంచిది. లేకుంటే మాత్రం ఇబ్బందికరమే.