Jubilee Hills By-Poll Result: తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తీవ్రమైన ఆసక్తిని కలిగించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపుగా గెలిచినట్టే. ప్రతి రౌండ్ లోను ఆయన తన లీడ్ పెంచుకుంటూ పోతున్నారు.. ఈ స్టోరీ రాసే సమయం వరకు నవీన్ యాదవ్ 60,402 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీత మీద 15,797 ఓట్ల లీడ్ లో ఉన్నారు. ఇప్పటికీ ఇంకా లెక్కింపు జరుగుతూనే ఉంది. ట్రెండ్ ఏమిటో అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.
ఎన్నికల ఫలితం ఏమిటో తెలిసిపోయింది కాబట్టి ఇప్పటికే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఆయన 10,235 ఓట్లు సాధించారు.. వాస్తవానికి బిజెపి నాయకులు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఈ స్థాయిలో ఓట్లు రావడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి ముందే ప్రారంభించగా.. భారతీయ జనతా పార్టీ మాత్రం ఆలస్యంగా మొదలుపెట్టింది. అభ్యర్థి విషయంలో కూడా తీవ్ర మంతనాలు జరిగాయి. చివరికి దిలీప్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టారు. దీపక్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టినప్పటికీ కీలకమైన నాయకులు ప్రచారంలోకి ముందుకు రాలేదు. బండి సంజయ్ వచ్చిన తర్వాతనే ఎన్నికల ప్రచారంలో కాస్త ఊపు వచ్చింది. ఆయన బోరబండ ప్రాంతంలో చేసిన ఎన్నికల ప్రచారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అది బిజెపికి కాస్త అడ్వాంటేజ్ అయినప్పటికీ.. వాటిని నిలబెట్టుకోవడంలో పార్టీ కార్యవర్గం విఫలమైంది. పోల్ మేనేజ్మెంట్ లో కూడా బిజెపి వెనుకడుగు వేసింది.. పోటీ పార్టీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటే.. బిజెపి నాయకులు మాత్రం వినోదం చూశారు. ఇక్కడ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి భారీగా ఓట్లు వస్తే.. ఉప ఎన్నికల నాటికి ఆ పరిస్థితి మొత్తం మారిపోయింది.. ఒకానొక దశలో డిపాజిట్ కూడా వస్తుందా అనే అనుమానం కూడా వ్యక్తం అయింది.
ఓటింగ్ సరళి అర్ధమైన తర్వాత దీపక్ రెడ్డి వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఫలితాలు వెళ్లడవుతున్నప్పుడు ఆయన తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు. ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అధిష్టానానికి సూటిగా తగిలే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ” ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలు కష్టపడి పని చేశారు. వారు చూపించిన ప్రేమను మర్చిపోలేను. క్షేత్రస్థాయిలో వారు తీవ్రంగా శ్రమించారు.. రూపాయి ఖర్చు పెట్టకుండా.. పోల్ మేనేజ్మెంట్ చేయకుండా ఇక్కడ దాకా వచ్చాం. ఈ ఓట్లు మొత్తం బిజెపి మీద అభిమానంతో ఓటర్లు వేసినవి. ఈ ప్రేమను కాపాడుకుంటాం. కాకపోతే క్షేత్రస్థాయిలో ఇంకా కష్టపడాల్సి ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఓటమి, గెలుపు శాశ్వతం కాదు. ఈ ఎన్నికలను కచ్చితంగా ఒక పాఠంగా తీసుకుంటాం. మలిదశ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమిస్తామని” దీపక్ రెడ్డి పేర్కొన్నారు.
దీపక్ రెడ్డి వెళ్తున్నప్పుడు చాలామంది కార్యకర్తలు బాధపడ్డారు. కొంతమంది కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. వారిని చూసి దిలీప్ రెడ్డి కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఎన్నికలను బిజెపి గనుక సీరియస్గా తీసుకొని ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పుడు పోటీ రసవత్తరంగా ఉండేదని చెప్తున్నారు. ఓవైపు బీసీ రాజకీయాలు తెలంగాణలో జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఓసి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీలో నిలబెట్టి బిజెపి తప్పు చేసిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బిజెపి, బిఆర్ఎస్ ఒకటేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. దానిని ఖండించడంలో కమలం నాయకులు విఫలమయ్యారు. ఇవన్నీ కూడా బిజెపి ఓటమికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.