Jubilee Hills By Election: మామూలుగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలలో అది కూడా ఒకటి. కానీ ఇప్పుడు అది అత్యంత ముఖ్యమైన నియోజకవర్గంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా ఏపీవ్యాప్తంగా కూడా దాని గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. దానికి కారణం ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతుండడమే.. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి మొదలుపెడితే నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ముఖ్యమంత్రి నుంచి కేటీఆర్ వరకు విస్తృతంగా ప్రచారం చేశారు.
ప్రచారం ముగిసి.. పోల్ మేనేజ్మెంట్ పై అన్ని పార్టీలు తీవ్రంగా దృష్టి సారించాయి. వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్నది కాబట్టి.. సహజంగానే ఇక్కడ అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇక్కడ గులాబీ పార్టీ ఏమాత్రం తగ్గడం లేదు. కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన పోటీ ఇచ్చే స్థాయిలో పనిచేసింది. అయితే బిజెపి ఇక్కడ పెద్దగా ప్రయత్నించడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఫలితం వచ్చిన బిజెపికి పెద్ద ఇబ్బంది లేదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.
గులాబీ పార్టీకి, హస్తం పార్టీకి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పరిస్థితి ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో జరుగుతున్న ఉప ఎన్నికను గులాబీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రచార వ్యూహాన్ని విభిన్నంగా పాటించింది. ప్రజల తమకు ఎందుకు ఓటు వేయాలి అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పగలిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే పేదల గృహాల మీదికి హైడ్రా బుల్డోజర్లు రావని గులాబీ పార్టీ నాయకులు పదేపదే ప్రచారం చేశారు. ఒకరకంగా మాగంటి సునీత ఖర్చును కూడా పార్టీ పెట్టుకుంది. ఒక దశలో అభ్యర్థి సునీత కంటే.. కేటీఆర్ అన్నట్టుగానే ప్రచారాన్ని సాగించింది గులాబీ పార్టీ. ఈ ఫలితాల గనుక తేడా వస్తే గులాబీ పార్టీ మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కంటోన్మెంట్ లో సిట్టింగ్ స్థానాన్ని గులాబీ పార్టీ పోగొట్టుకుంది. ఇక్కడ కూడా ఓడిపోతే గులాబీ పార్టీకి పునాదులకు బీటలు వారతాయని ప్రజలు కచ్చితంగా అనుమానిస్తారు. అందువల్ల ఈ స్థానంలో గెలవడానికి గులాబీ పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది…
అంతర్గత రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అధిష్టానం ఎప్పటికప్పుడు బ్రేకులు వేస్తోంది. కొంతమంది మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో తన అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకోవాలి. ఈ గెలుపు ద్వారా రేవంత్ పార్టీ మీద మరింత పట్టు సాధిస్తారు. ప్రభుత్వం మీద మరింత పెత్తనాన్ని అందిపుచ్చుకుంటారు. అంతేకాదు సీనియర్ మంత్రులపై ఆయనకు అప్పర్ హ్యాండ్ పెరుగుతుంది. దీనికి తోడు గవర్నమెంట్ మీద పాజిటివిటీ ఎక్కువవుతుంది. అందువల్లే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రులను, ఎమ్మెల్యేలను జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు నేతలు అక్కడి నుంచి రావద్దని పేర్కొన్నారు.. ఇక్కడ గనక తేడా ఫలితం వస్తే కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. అంతే కాదు ముఖ్యమంత్రిపై కూడా ఒత్తిడి అధికమవుతుంది.